ఈ కథ అశోక్ చేయాలని రాసి ఉంది : ప్రశాంత్ వర్మ
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... తాను ఈ కథను 7 సంవత్సరాల క్రితం రాసుకున్నాను.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అయ్యాడు కానీ కమర్షియల్ హిట్ సొంతం చేసుకోలేక పోయాడు. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని రీ లాంచ్ ప్రాజెక్ట్‌గా 'దేవకీ నందన వాసుదేవ' సినిమాను చేయడం జరిగింది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ ను అందించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా రేంజ్‌లో ఏ స్థాయిలో మారు మ్రోగుతుందో చూస్తూనే ఉన్నాం. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మాత్రమే కాకుండా ఆయన కథలు అందించిన సినిమాలు, స్క్రీన్‌ప్లే అందించిన సినిమాలు సైతం భారీ విజయాలను సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి.
అందుకే ప్రశాంత్ వర్మ రాసిన కథతో అశోక్ గల్లా హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అశోక్ గల్లాకి జోడీగా మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది. సొంత బ్యానర్‌లో ఈ సినిమాను అశోక్ గల్లా తండ్రి జయదేవ్ నిర్మించారు. ఈ సినిమాకు అర్జున్ జంద్యాల దర్శకత్వం వహించగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణ చేశారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ హ్యాండ్ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనబడుతోంది.
తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరోలు రానా, సందీప్ కిషన్, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా పాల్గొన్నారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... తాను ఈ కథను 7 సంవత్సరాల క్రితం రాసుకున్నాను. నాకు పర్సనల్‌గా చాలా నచ్చిన కథ. నేనే ఈ సినిమాను చేయాలని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ప్రతి కథ మీద దేవుడు హీరో పేరు రాస్తాడని నేను నమ్ముతాను. ఈ కథపై అశోక్ పేరు ఉండటం వల్లే ఆయన వద్దకు వచ్చిందని నేను నమ్ముతున్నాను. అర్జున్ ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారని భావిస్తున్నాను అన్నారు.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ సినిమాతో పాటు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాకి సైతం దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మతో బాలీవుడ్ ప్రముఖ హీరోలు సైతం సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం టాలీవుడ్‌లోనే సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో సినిమాలు చేసి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ప్రశాంత్ వర్మ కథలు, సినిమాలు ఉంటాయి. కనుక అశోక్ గల్లాకి ఈ సినిమా మొదటి సక్సెస్ ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.