జై జై హనుమాన్.. ఆ ఇద్దరితో ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ వర్మ?
ప్రశాంత్ వర్మ సోమవారం తన ఎక్స్ అకౌంట్ లో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, రిషబ్ శెట్టిలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి సర్‌ప్రైజ్ చేసారు. దీనికి 'జై జై హనుమాన్ !!' అనే క్యాప్షన్ పెట్టారు.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హను-మాన్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగంగా, ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో, కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు ఇటీవల దీపావళి సందర్భంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు దర్శకుడు సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసి సరికొత్త చర్చకు తెర లేపారు.
ప్రశాంత్ వర్మ సోమవారం తన ఎక్స్ అకౌంట్ లో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, రిషబ్ శెట్టిలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి సర్‌ప్రైజ్ చేసారు. దీనికి 'జై జై హనుమాన్ !!' అనే క్యాప్షన్ పెట్టారు. దీనికి రానా, రిషబ్ లతో పాటుగా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌ను కూడా కోట్ చేశారు. దీంతో హ్యాండ్సమ్ హంక్ రానా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారని సినీ అభిమానులు భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఇద్దరు హీరోలతో ఏం ప్లాన్ చేస్తున్నాడో అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
నిజానికి 'హను-మాన్' సీక్వెల్ లో హనుమంతుడి క్యారక్టర్ లో రానా నటిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. చివరకు హనుమాన్ గా రిషబ్ శెట్టిని ఫిక్స్ చేసారు. ఇప్పుడు 'జై హనుమాన్' మూవీలో రానా దగ్గుబాటి ఎలాంటి రోల్ ప్లే చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పాపులర్ యాక్టర్ కాబట్టి, ఆయనది ఏదో కీలకమైన పాత్రే అయ్యుంటుందనిపిస్తోంది. రావణాసురుడి పాత్రలో కనిపించే అవకాశం ఉందని కొందరు అంటుంటే, రాముడి పాత్రలో నటిస్తారేమో అని మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాటిక్ యూనివర్స్ లో రానాతో సెపెరేట్ మూవీ తీసేలా ఇంకేదైనా పాత్ర క్రియేట్ చేస్తారేమో అని కూడా ఆలోచిస్తున్నారు.
అయితే 'హను-మాన్' క్లైమాక్స్ లో అసుర తాండవ మహాప్రళయం మొదలైందని, మరో మహా యుద్ధం పురుడు పోసుకోనుంది విభీషణుడిగా నటించిన సముద్రఖని చెబుతాడు. కాబట్టి అసురులకు నాయకుడిగా ఏదైనా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసి ఉంటారని ఊహిస్తున్నారు. రిషబ్ శెట్టి లాంటి నటుడికి ధీటుగా నిలబడాలంటే, అదే స్థాయిలో ఉండే రానా లాంటి నటుడు అవసరం అని భావిస్తున్నారు. 'బాహుబలి' చిత్రంలో ప్రతినాయకుడు భళ్లాలదేవుడి పాత్రలో రానా అద్భుతంగా నటించారు. ప్రభాస్‌కు దీటుగా నిలబడ్డారు. 'జై హనుమాన్'లో రానాని ఎలాంటి రోల్ లో చూపిస్తారో వేచి చూడాలి. ఏదేమైనా రానా రాకతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పాలి.
సమకాలీన కథలను పౌరాణిక ఇతిహాసాలతో బ్లెండ్ చేసి సినిమాలు తీస్తున్నారు ప్రశాంత్ వర్మ. 'హను-మాన్' చివర్లో చెప్పినట్లుగా శ్రీరాముడికి హనుమంతుడు ఏం మాట ఇచ్చాడు? దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఏం చేశాడు? అనే పాయింట్ మీద 'జై హనుమాన్' సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటుగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరికొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథలు అందిస్తున్నారు.