బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్స్… క్లిక్కయితే ఆ దర్శకుడికే..
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో ‘ఆదిత్య 369’ సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో ‘ఆదిత్య 369’ సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఈ సినిమా వచ్చింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1991లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా కూడా మంచి ప్రాఫిట్స్ అందించింది. టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ సినిమాల జాబితాలో ‘ఆదిత్య 369’ సినిమా కూడా స్థానం సంపాదించుకుంది. మూడు డిఫరెంట్ టైం లైన్స్ లో ఈ సినిమా కథని సింగీతం చెప్పారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.
ఈ సినిమా తర్వాత కూడా ఇండియాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ లతో మూవీస్ ఎవరు చేసే సాహసం చేయలేదు. బాలకృష్ణకి కూడా ‘ఆదిత్య 369’ సినిమా అంటే ప్రత్యేమైన అభిమానం ఉంది. అందుకే దానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. ‘ఆదిత్య 999’ టైటిల్ తో మూవీ చేస్తానని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణ గతంలో ప్రకటించారు. అలాగే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ‘ఆదిత్య 999’ సినిమాతోనే ఉంటుందని బాలయ్య తెలిపాడు.
అయితే బాలకృష్ణ హఠాత్తుగా మళ్ళీ ఈ ‘ఆదిత్య 999’ సినిమాని హోల్డ్ లో పెట్టారు. ఎందుకంటే మరోవైపు ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా తన కొడుకు మోక్షజ్ఞని లాంచ్ చేస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా హిట్ కొడితే ప్రశాంత్ వర్మకి బాలయ్య మరో ఆఫర్ ఇవ్వబోతున్నారంట. అదే ‘ఆదిత్య 999’. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలని బాలయ్య ప్రశాంత్ వర్మకి అప్పగించే అవకాశం ఉందంట. ఇప్పటికే ప్రశాంత్ వర్మకి ఒక మాట చెప్పి ఉంచారని టాక్.
అలాగే ‘భైరవద్వీపం’ సీక్వెల్ బాధ్యతలు కూడా ప్రశాంత్ వర్మకి ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలని మోక్షజ్ఞతోనే చేయడానికి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. మరి మోక్షజ్ఞకి ప్రశాంత్ వర్మ ఎలాంటి సక్సెస్ ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారు. అలాగే హీరోయిన్ కోసం వెదుకుతున్నారు.
సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని గతంలో బాలయ్య ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. అలాగే మోక్షజ్ఞ కోసం చాలా మంది దర్శకులు లైన్ అప్ లో ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.