ఆ పాత్ర కోసం రిషబ్ శెట్టి అనుకున్నా.. కానీ : ప్రశాంత్ వర్మ

హనుమాన్ సినిమాలో రావణాసురుడి తమ్ముడు విభీషణుడి పాత్రను ప్రముఖ సీనియర్ నటుడు సముద్రఖని పోషించారు.

Update: 2024-01-23 15:30 GMT

సూపర్ హీరో మూవీ హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ.. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో హనుమాన్ మూవీ టీమ్.. ఇంకా ప్రమోషన్లను చేస్తోంది.

హనుమాన్ సినిమాలో రావణాసురుడి తమ్ముడు విభీషణుడి పాత్రను ప్రముఖ సీనియర్ నటుడు సముద్రఖని పోషించారు. ఆ పాత్రకు మూవీలో చాలా ప్రాధాన్యం ఉంది. అయితే విభీషణుడి క్యారెక్టర్ కోసం ముందుగా కన్నడ హీరో, కాంతార స్టార్ రిషబ్ శెట్టిని అనుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‍ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు.

''నా యూనివర్స్ లో ఫస్ట్ సినిమా అయిన హనుమాన్‍ లో విభీషణుడి రోల్ కోసం ముందుగా నేను కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని అనుకున్నా. కానీ ఆయన తన కాంతార సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే PVCU (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్)లోని ఓ సినిమాలో నటించేందుకు ఆయన ఆసక్తి చూపించారు” అని ప్రశాంత్ వర్మ చెప్పారు.

కాగా, హనుమాన్ సినిమాను చూశాక ఇటీవలే రిషబ్ శెట్టి కూడా ట్వీట్ చేశారు. ప్రశాంత్ వర్మ స్టోరీ టెల్లింగ్, ఫిల్మ్ మేకింగ్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. తేజ సజ్జా పెర్ఫార్మెన్స్ అనేక ఏళ్ల పాటు సినీ ప్రియులందరికీ గుర్తుండిపోతుందని రాసుకొచ్చారు. హనుమాన్ చిత్రాన్ని ప్రశంసిస్తున్న వారిలో తాను కూడా చేరుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.

జనవరి 12వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన హనుమాన్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల కలెక్షన్ల మార్కును దాటింది. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లో ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. హనుమాన్‍ కు సీక్వెల్‍గా జై హనుమాన్ ను ప్రకటించిన ప్రశాంత్ వర్మ.. నిన్న అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు.


Tags:    

Similar News