700 గొర్రెల మధ్యలో తానో గొర్రెలా!
పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్ర పోషించిన `ఆడు జీవితం` ఇటీవల రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్ర పోషించిన `ఆడు జీవితం` ఇటీవల రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎడారిలో చిక్కుకున్న నజీబ్ తిరిగి సొంత దేశానికి ఎలా చేరాడు? అన్న కథతో ఎంతో హృద్యంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. నజీబ్ కథని బెన్యమిన్ రచించడంతోనే ఇది సాధ్యమైంది. పుస్తకంలో ఉన్న అంశాల్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఓసారి నజీబ్ జీవితంలోకి వెళ్తే..
కేరళలోని అలెప్పి దగ్గర చిన్న గ్రామం నజీబ్ ది. కుటుంబ పోషణ కోసం దేశం వదిలి సౌదీ వెళ్తాడు. ఏజెంట్ నజీబ్ కి ఓ మాల్ లో పని అని చెప్పి మోసం చేసి తీసుకెళ్తాడు. సౌదీ ఎయిర్ పోర్టులో దిగగానే నజీబ్ కష్టం మొదలవుతుంది. రెండు రోజుల పాటు ఎయిర్ పోర్టు పరిసరాల్లో తిరిగిన తర్వాత తాను మోసపోయాడు అన్న సంగతి గ్రహిస్తాడు. అలా ప్రవేశంచిన నజీబ్ ఓ అరబ్ షేక్ దగ్గరకు చేరతాడు. ఎడారిలో ఆ షేక్ పెద్ద షెడ్ వేసుకుని 700 కోర్రెల్ని మేపుతుంటాడు.
ఆ పనికి అక్కడ కుదురుతాడు నజీవ్. దీంతో అతడి జీవితమే మారిపోతుంది. స్నానానికి నీళ్లు ఉండవు. ఉండటానికి నీడ దొరకదు. ఆషేక్ కేవలం బతకడం కోసం ముతక రోట్టెలు వేసి వెళ్లేవాడు. వాటిని గొర్రె పాలతో తడిపి తినేవాడు. యజమాని..అతడు తమ్ముడు మాత్రమే ఆ ప్రాంతంలో కనిపించేవారు. ఇంకెవ్వరు సంచరించని ప్రదేశం అది. అరబిక్ తప్ప మరోభాష మాట్లాడరు. మరో మనిషి అక్కడ కనిపించడు. నజీబ్ ఏడ్చినప్పుడల్లా కొట్టి హింసించేవారు.
అప్పటికే నజీబ్ కి ఎడారి భ్రాంతి మొదలైంది. గొర్రెల మధ్య జీవితం తాను ఓ గొర్రె అని భావించాడు. రెండేళ్ల పాటు ఇలాగే జీవశ్చవంలా బ్రతికాడు. ఓ రోజు అన్నదమ్ములిద్దరు పెళ్లికి వెళ్తారు. ఇదే అదునుగా నజీబ్ కి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఎటు చూసినా ఎడారే? ఎటు వెళ్లాలో తెలియదు. అలా ప్రయాణించగా చివరిక ఓ మలయాళీ కనిపించి దారి చెబుతాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. కొంత కాలం పాటు ప్రయాణించగా ఓ రోడ్డు ద్వారా రియాద్ చేరతాడు. అక్కడ మలయాళీలు నజీబ్ ని ఆదుకుంటారు. నజీబ్ వద్ద తగిన పత్రాలు లేనందున పోలీసులకు లొంగిపోయి 10 రోజులు అక్కడ జైల్లో ఉంటాడు. ఆ తర్వాత ఇండియాకి వస్తాడు.