చిలుకూరు బాలాజీకి ప్రియాంక చోప్రా మొక్కు
ఇటీవల తెలంగాణలోని చిల్కూర్ బాలాజీ ఆలయాన్ని సందర్శించినప్పటి అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎస్ఎస్ రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్ మూవీ SSMB 29 లో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుందని కథనాలొచ్చాయి. ఈ సినిమా ఫోటోషూట్ కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ కి విచ్చేసిందని మీడియాలో వార్తలు వచ్చాయి. దీని గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించక ముందే, రకరకాల ఊహాగానాల మధ్య ప్రియాంక చోప్రా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఇటీవల తెలంగాణలోని చిల్కూర్ బాలాజీ ఆలయాన్ని సందర్శించినప్పటి అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ మంగళవారం తన ఇన్‌స్టాలో ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ప్రియాంక లేత నీలం రంగు సల్వార్ సూట్‌లో అందంగా కనిపించింది. పీసీ ఆలయ ప్రాంగణంలో పండితుడితో మాట్లాడుతుండగా కనిపించింది. తన బృందంతో కలిసి ఆలయం లోపల నడుస్తున్న వీడియో క్లిప్ వైరల్ గా మారింది. బాలాజీ ఆశీర్వాదంతో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని పీసీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ప్రియాంక ఇటీవలే సిటాడెల్ రెండవ సీజన్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తను నటించిన చివరి భారతీయ చిత్రం ది స్కై ఈజ్ పింక్. సిటాడెల్ సీజన్ 2 కోసం వేచి చూస్తుండగానే మహేష్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అవకాశం అందుకుందన్న వార్తలు వేడెక్కిస్తున్నాయి. తదుపరి చిత్రాల గురించి పీసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.