SSMB29: ఆమె మళ్ళీ వచ్చింది!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 గురించి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అప్డేట్ వస్తూనే ఉంది.

Update: 2025-02-17 09:53 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 గురించి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. ఈసారి కథానాయిక ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక, చాలా కాలం తర్వాత ఓ భారీ తెలుగు చిత్రంలో నటించనుండటంతో ఆసక్తి నెలకొంది.

ఇటీవల ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వీడియోను షేర్ చేశారు. ఇక ఆమెను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కూడా మీడియా స్పాట్ చేయడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుకలకు బ్రేక్ తీసుకున్న ప్రియాంక, ఇప్పుడు SSMB29 కోసం మళ్లీ హైదరాబాద్‌లో కనిపించారు.

ఇప్పటికే జనవరిలో సినిమా వర్క్ మొదలైంది. ఆ సమయంలో వర్క్ షాప్ తో పాటు పూజా కార్యక్రమాలు జరిగాయని టాక్. ప్రియాంక కూడా ఆ లాంచ్ వేడుకలో పాల్గొంది. అనంతరం ఆమె సోదరుడి వివాహం కోసం బ్రేక్ తీసుకొని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మరొక షెడ్యూల్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిర్మాత KL నారాయణ సుమారు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పాటేకర్, మలయాళ స్టార్ ప్రిత్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు జక్కన్న క్యారెక్టర్లపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కనీసం షూటింగ్ స్టార్ట్ అయ్యింది అనే విషయంలో కూడా వివరణ ఇవ్వలేదు. మహేష్ బాబు సరసన ప్రియాంక నటించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఇద్దరి జోడీ తెరపై ఎలా ఉంటుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. అడ్వెంచర్, యాక్షన్ మిశ్రమంగా ఉండే ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. మొత్తానికి ప్రియాంక హైదరాబాద్ చేరుకోవడంతో SSMB29 తాజా షెడ్యూల్ మరింత ఆసక్తికరంగా మారింది. మహేష్, రాజమౌళి, ప్రియాంక, నానా పాటేకర్, ప్రిత్విరాజ్ వంటి స్టార్ కాస్టింగ్‌తో ఈ సినిమా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News