తెలంగాణ గడికోట మహాదేవుని ఆలయంలో ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా డివోషనల్ యాత్రను కొనసాగిస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు.
లాస్ ఏంజెల్స్ (ఎల్ఏ) నుంచి భారతదేశంలో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా, ముంబై టు హైదరాబాద్ ప్రయాణాలతో కొద్దిరోజులుగా తెలుగు మీడియాలోను నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. పీసీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఇటీవల నగరానికి సమీపంలోని ప్రఖ్యాత చిలుకూరి బాలాజీ ఆలయంలో దైవిక ఆశీర్వాదం కోరుతూ పూజలాచరించిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 6.42 గంటలకు దట్టమైన పొగమంచు కురుస్తుండగా, ఆలయానికి ప్రయాణిస్తున్న వీడియోను పీసీ షేర్ చేయగా వైరల్ అయింది. నుదిటిపై ఎరుపు- తెలుపు బొట్టుతో చీరలో సాంప్రదాయ బద్ధంగా కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
ప్రియాంక చోప్రా డివోషనల్ యాత్రను కొనసాగిస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈరోజు(శుక్రవారం) ప్రియాంక చోప్రా కామారెడ్డిలోని దోమకొండ మండలం గడికోట మహాదేవుడి ఆలయాన్ని సందర్శించారు. నేటి వేకువఝామునే పీసీ కార్‌లో ఆలయానికి వెళ్లి దేవాదిదేవునికి పూజలాచరించారు. గడికోటకి వచ్చిన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాకు ట్రస్ట్ సభ్యులు, ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పీసీ ఆలయ నిర్వాహకులతో ముచ్చటించారు. ఆలయ సందర్శన నుంచి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో గడపడానికి ప్రత్యేక కారణం ఉంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ SSMB29లో కథానాయికగా ఎంపికైందని ఇటీవల కథనాలొచ్చాయి. అయితే దీని గురించి చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. హాలీవుడ్ లోను పీసీ తన కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తోంది. అక్కడ `హెడ్స్ ఆఫ్ స్టేట్` అనే చిత్రంలో ప్రముఖ తారలు ఇడ్రిస్ ఎల్బా , జాన్ సెనాతో కలిసి నటిస్తోంది. ఇల్యా నైషుల్లర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది యాక్షన్ కామెడీ చిత్రం. అలాగే 19వ శతాబ్దపు కరేబియన్ పైరేట్ `ది బ్లఫ్`లో కూడా నటిస్తోంది. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ లోను పీసీ నటించాల్సి ఉంది.