సీనియర్ కమెడియన్ కు ఇది కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా?
అయితే ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో ఆలీ కోసం పూరీ కొత్త క్యారక్టర్ ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ సినిమాలలో కమెడియన్ అలీకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, బిజినెస్ మ్యాన్ లాంటి రెండు మూడు చిత్రాలు మినహా పూరీ తీసే అన్ని మూవీస్ లోనూ అలీ పాత్ర ఉంది. ఆయన పాత్ర పేర్లు, గెటప్స్ కొత్తగా ఉండేలా చూసుకుంటారు. కొన్నిసార్లు కథతో సంబంధం లేకుండా అలీ కోసం ప్రత్యేకమైన ట్రాక్స్ రాస్తుంటారు. వాటిల్లో ఎక్కువ శాతం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నవే ఉన్నాయి. అయితే ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో ఆలీ కోసం పూరీ కొత్త క్యారక్టర్ ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "డబుల్ ఇస్మార్ట్". ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం విడుదల చేశారు. మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ కు హామీ ఇస్తున్న ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇది పూరి స్టైల్ లో సాగే మాస్ మసాలా యాక్షన్ సినిమా అని స్పష్టం చేసింది. ఇందులో రామ్, సంజయ్ దత్, కావ్య థాపర్ లతో పాటుగా అలీ పాత్ర కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 'ఏ లబాడే' అంటూ ఆయన డిఫరెంట్ లాంగ్వేజ్ లో డైలాగ్స్ చెబుతూ, విచిత్రమైన గెటప్ లో అలరించారు.
'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ లో అలీని చూసి గ్రహంతర వాసి పాత్ర పోషించారేమో అనే సందేహాలు వ్యక్తం చేశారు సినీ అభిమానులు. అయితే అమెజాన్ ఫారెస్ట్ లో మాట్లాడుకునే ఒక భాషను కనిపెట్టి పూరీ జగన్నాధ్ తన కోసం ఈ అధ్బుతమైన క్యారెక్టర్‌ను క్రియేట్ చేసినట్లుగా అలీ వెల్లడించారు. ఈ కామెడీ ట్రాక్ సినిమాలో బాగా పేలిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన బాడీ లాంగ్వేజ్, మాటలు, చేష్టలు అన్ని థియేటర్లలో నవ్వులు పోయిస్తాయని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
అయితే అలీ ట్రాక్ కీ 'డబుల్ ఇస్మార్ట్' కథకూ సంబంధం ఉండదని తెలుస్తోంది. ఈ విషయాన్ని హీరో రామ్ పోతినేని స్వయంగా తెలిపారు. మాంచి యాక్షన్ మూడ్ లో సాగిపోతున్న ఈ సినిమాలో, అలీ పాత్ర కామెడీ పంచే బాధ్యత తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. నిజానికి పూరీ జగన్నాధ్ కు ముందు ఈ ట్రాక్ పెట్టాలనే ఆలోచన లేదట. సినిమా అంతా పూర్తయిన తర్వాత, కామెడీ పండించడం కోసం అప్పటికప్పుడు అలీ పాత్రను రాసుకున్నారట.
పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ 'బాచి' దగ్గర నుంచి 'లైగర్' వరకూ ఎన్నో సినిమాల్లో అలీ పాత్రలు హైలైట్ గా నిలిచాయి. కానీ ఈ మధ్య వర్ధమాన దర్శకులు సీనియర్ కమెడియన్ కు సరైన పాత్రలు రాయడం లేదు. ఆయన పూర్తి స్థాయిలో నచ్చించి చాలా రోజులైంది. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ తో ఆ లోటు తీరుతుందని అనుకుంటున్నారు. కాకపోతే ఇటీవల కాలంలో జనాలు కథలో భాగంగా వచ్చే కామెడీని ఎంజాయ్ చేస్తుండటంతో, సెపరేట్ కామెడీ ట్రాక్స్ పెద్దగా వర్కవుట్ అవడం లేదు. మరి పూరీ ఈసారి 'డబుల్ ఇస్మార్ట్' తో ఆడియెన్స్ ను ఎలా మెప్పిస్తారో చూడాలి. ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.