పుష్పరాజ్ కు తోడుగా వాళ్ళెవరూ రాలేదేంటి?
ఇండియా వైడ్ గా మేజర్ సిటీస్ నిర్వహించిన భారీ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. కానీ ఆయనకు తోడుగా సినిమాలో నటించిన చాలామంది ప్రధాన నటీనటులు ఈ ఈవెంట్స్ కు రాలేదు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ''పుష్ప 2'' సినిమా ప్రీమియర్ షోలు ఇవాళ రాత్రికే పడనున్నాయి. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. మూవీ టీమ్ తో ఆన్ లైన్ ఇంటర్వ్యూలు లాంటివి లేకుండా, ఎక్కువగా ఆఫ్ లైన్ ప్రమోషన్స్ తోనే ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. నిజానికి బన్నీ ఒక్కడే ఈ సినిమా ప్రచారాన్ని తన భుజాన వేసుకొని, దేశమంతా తిరిగాడు. ఇండియా వైడ్ గా మేజర్ సిటీస్ నిర్వహించిన భారీ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. కానీ ఆయనకు తోడుగా సినిమాలో నటించిన చాలామంది ప్రధాన నటీనటులు ఈ ఈవెంట్స్ కు రాలేదు.
పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై, హైదరాబాద్.. వంటి మహా నగరాలలో గ్రాండ్ గా 'పుష్ప 2' ఈవెంట్స్ జరిగాయి. అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నలతో పాటుగా మైత్రీ నిర్మాతలు మాత్రమే ఈ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగిన వైల్డ్ ఫైర్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం వీరితో పాటుగా సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, శ్రీలీల, అనసూయ భరద్వాజ్ వచ్చారు. మాములుగా ఏ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినా ఆ సినిమాలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ పాల్గొంటారు. కానీ 'పుష్ప 2' ఈవెంట్స్ లో మిగతా యాక్టర్స్ ఎవరూ కనిపించలేదు.
'పుష్ప 2: ది రూల్' సినిమాలో ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, డాలీ ధనుంజయ, తారక్ పొన్నప్ప, అజయ్, బ్రహ్మాజీ, జగదీష్, సౌరబ్ సచ్ దేవ్, మైమ్ గోపీ, ఆదిత్య మీనన్, శ్రీతేజ్.. ఇలా చాలామంది పాపులర్ యాక్టర్స్ ఉన్నారు. కానీ వీళ్లల్లో ఒక్కరు కూడా పుష్ప ఈవెంట్స్ లో కనిపించలేదు. బయట కూడా ఎక్కడా ప్రమోషన్స్ చేయలేదు. వాళ్ళ కెరీర్ కు బాగా ఉపయోగపడే క్రేజీ సీక్వెల్ కాబట్టి, ఈ సినిమాలో నటించామని చెప్పుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు. అలాంటిది పుష్ప-2 ఈవెంట్స్ కు వారంతా ఎందుకు రాలేదనే ప్రశ్నార్ధంకంగా మారింది.
'పుష్ప 2' సినిమాలో విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్ నటించిన సంగతి తెలిసిందే. 'పుష్ప: ది రైజ్' చివర్లో భన్వర్ సింగ్ షెకావత్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫహద్.. సీక్వెల్ లో అదరగొట్టబోతున్నాడని ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. రెగ్యులర్ విలన్ గా కాకుండా, ఆయన పాత్రకు కూడా మంచి ఎలివేషన్స్ ఉన్నట్లు అర్థమైంది. ఆశ్చర్యకరంగా ఆయన ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. ఈ సినిమా గురించి మాట్లాడలేదు. ఫహద్ చిన్న నటుడేమీ కాదు. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డు అందుకున్న గొప్ప నటుడు.. మలయాళంలో క్రేజీ హీరో. ఆయన వల్ల ఏ సినిమాకైనా మరికొంత క్రేజ్ వస్తుందే కానీ, తగ్గే పరిస్థితి లేదు.
అందులోనూ కొచ్చిలో 'పుష్ప 2' ఈవెంట్ చేసారు. దీనికి అల్లు అర్జున్ కూడా వెళ్లారు కానీ, కేరళలో మంచి స్టార్ డమ్ ఉన్న ఫహద్ ఫాసిల్ మాత్రం హాజరు కాలేదు. ఫహద్ ఈవెంట్ కు రాకపోవడం ప్రతికూలంగా ఏమీ మారలేదు. ఎందుకంటే బన్నీకి కూడా మలయాళంలో తక్కువ క్రేజ్ లేదు. అక్కడ ఆయన్ను మల్లూ అర్జున్ అని పిలుచుకుంటారు.అతని సినిమా వస్తుందంటే మలయాళ స్టార్ హీరోల సినిమాలను కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 'పుష్ప 2'కి కేరళలో మామూలు హైప్ లేదు. దానికి ఫహాద్ కూడా యాడ్ అయితే మాలీవుడ్ లో ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యుండేది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా 'పుష్ప 2' ఈవెంట్స్ లో ఫహద్ ఫాజిల్ తో సహా మిగతా నటీనటులు ఎందుకు రాలేదనేది ప్రశ్నార్థంగా మారింది. నిర్మాతలు అసలు పిలివలేదా? పిలిచినా వాళ్ళు రాలేదా? అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే అల్లు అర్జున్ బ్రాండ్ ను సోలోగా జనాల్లోకి తీసుకెళ్లడానికే ఇలా ప్లాన్ చేసి ఉంటారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. సినిమాకి కావాల్సినంత బజ్ ఉందని, మిగతా యాక్టర్స్ వచ్చి కొత్తగా ఈ సినిమాకి ప్రమోషన్స్ చెయ్యాల్సిన అవసరం రాలేదనే మాట కూడా వినిపిస్తోంది. మరి సినిమా సక్సెస్ మీట్ లో అయినా వీరంతా కనిపిస్తారేమో చూడాలి.