ఐటీ రైడ్స్: 'పుష్ప 2' లెక్కల్లో బొక్కలు ఉన్నాయా..?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల నివాసాలు, ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-22 08:33 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల నివాసాలు, ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్, వారికి సన్నిహితంగా ఉండే సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. సినిమాలకు ఖర్చు చేసిన బడ్జెట్, ఆదాయం లెక్కలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీపై ఐటీ సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నారు.

'పుష్ప 2' సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ తో పాటుగా సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ శాఖ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్‌, రాబడిపై ఆరాలు తీసిన అధికారులు.. 'పుష్ప 2' వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలానే మైత్రీ నిర్మాతల బ్యాంక్ లావాదేవీలు కూడా పరిశీలించి చూస్తున్నారని అంటున్నారు.

'పుష్ప' నిర్మాత నవీన్ ఎర్నేని, మైత్రీ సీఈఓ శశి ఇళ్లపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు అగ్ర నిర్మాత దిల్ రాజు నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం దిల్ రాజు భార్యను అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి, లాకర్లు ఓపెన్ చేయించి ఆస్తుల వివరాలను లెక్కించారు. అటు దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్సితా రెడ్డి నివాసాలపై కూడా దాడులు జరిగాయి. ఎస్‌వీసీ ఆఫీసులో ఈరోజు మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

సినీ నిర్మాతల ఇళ్లు, ఆస్తులపై ఐటీ దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి ఉదంతాలు మనం గతంలో చాలానే చూశాం. అయితే అధికారులు 55 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ప్రముఖ నిర్మాతల నివాసాలు, ప్రొడక్షన్ హౌస్‌లపై దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్నటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతలు తమ సినిమాల కలెక్షన్ల గురించి విడుదల చేసిన పోస్టర్లే ఈ ఐటీ రైడ్స్ కు కారణమా? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది.

'పుష్ప 2' సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 1000 కోట్లు దాటిందని మైత్రీ మూవీ మేకర్స్ పబ్లిక్ గా ప్రకటించారు. సినిమా రిలీజైన తర్వాత రోజు రోజుకూ కలెక్షన్ పోస్టర్లు వదులుతూ వచ్చారు. ఫాస్టెస్ట్ 100 కోట్లు, 200 కోట్లు, 300, 500, 800, 1000, 1500 కోట్లు.. అంటూ పోస్టర్లలో వసూళ్లను అధికారికంగా పేర్కొన్నారు. ఫైనల్ గా 1830 కోట్లకు పైగా కలెక్షన్స్ తో 'బాహుబలి 2'ని క్రాస్ చేసి, ఇండియాలోనే నెం.1 సినిమాగా నిలిచిందని ఘనంగా చాటుకున్నారు.

మరోవైపు దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన 'గేమ్ ఛేంజర్' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా.. ఫస్ట్ డే రూ.186 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. రెండో రోజు నుంచి మేకర్స్ సైలెంట్ అయ్యారు. అప్పటి నుంచి 'సంక్రాంతికి వస్తున్నాం' పోస్టర్ల మీద ఫోకస్ పెట్టారు. ఇలా నిర్మాతలు పోటా పోటీగా పోస్టర్లు విడుదల చెయ్యడమే కొంప ముంచిందని, ఐటీ శాఖ దాడులు చేయడానికి అవకాశం కల్పించిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. మరి రైడ్స్ తర్వాత అధికారులు ఏం తెలుస్తారో చూడాలి.

Tags:    

Similar News