పుష్ప-2.. ఆస్కార్ రేసు సంగతేంటి?
అనేక మంది సినీ ప్రముఖులు అరెస్ట్ ను ఖండించారు.
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంతో సినీ ఇండస్ట్రీ అంతా ఉలిక్కిపడింది. నార్త్ టు సౌత్.. హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా బన్నీ అరెస్ట్ కోసం చర్చ సాగింది. అనేక మంది సినీ ప్రముఖులు అరెస్ట్ ను ఖండించారు. అల్లు అర్జున్ కు మద్దతు పలికారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ప్రీమియర్స్ ను డిసెంబర్ 4వ తేదీన వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సంధ్య థియేటర్ వద్ద రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆ కేసులో చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. తొలుత నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ సంబంధిత పత్రాలు జైలు అధికారులకు కాస్త ఆలస్యంగా అందడంతో అల్లు అర్జున్ ను శుక్రవారం రాత్రి చంచల్ గూడ జైల్లోనే ఉంచారు. శనివారం ఉదయం విడుదల చేయగా.. నేరుగా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ న్యాయవాదులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి బన్నీ తన ఇంటికి చేరుకున్నారు.
అయితే పుష్ప-2 సినిమాను ఆస్కార్ రేసులోకి తీసుకెళ్లాలని అల్లు అర్జున్ తో పాటు మూవీ టీమ్ అంతా భావిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. బెస్ట్ హీరోతో పాటు బెస్ట్ మూవీకి గాను నామినేషన్లు అందుకోవాలనే బన్నీ టార్గెట్ పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. బోస్టన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌తో సహా అనేక నగరాల్లో స్పెషల్ స్క్రీనింగ్స్ ను ప్లాన్ చేసుకున్నారట.
ఆస్కార్ సాధించాలనే టార్గెట్ తో ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన విధంగానే అమెరికాలో ప్రమోషన్లకు భారీగా పెట్టుబడులు పెట్టాలని అల్లు అర్జున్ యోచిస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు బన్నీ అరెస్ట్ తర్వాత ఆస్కార్ ప్లాన్స్ పై జోరుగా చర్చ సాగుతోంది. వరల్డ్ వైడ్ గా బన్నీ ప్లాన్ చేసుకున్న టూర్ నిలిచిపోయేలా కనిపిస్తుందని చెబుతున్నారు.
చట్టపరమైన పరిణామాల వల్ల పది నగరాల బన్నీ పర్యటన కష్టమని అంచనా వేస్తున్నారు. అయితే ఏదేమైనా ఓ కేసులో అరెస్ట్ అయిన నటుడి సినిమాను ఆస్కార్ రేసులో ఉండకూడదనే నిబంధన ఎక్కడా లేదు. కానీ ఆ ప్రభావం మాత్రం ఉంటుందని చెబుతున్నారు. మరి పుష్ప-2 ఆస్కార్ రేసులో దిగుతుందో లేదో వేచి చూడాలి.