ప్రసాద్స్‌లో పుష్ప 2 : ఎవ్వరూ తగ్గలే, సినిమా పడలే!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొంది ప్రపంచ వ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొంది ప్రపంచ వ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 12 వేల స్క్రీన్స్‌లో సినిమాను విడుదల చేసినట్లుగా మైత్రి మూవీ మేకర్స్ గొప్పగా ప్రకటించారు. కానీ హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో మాత్రం పుష్ప 2 సినిమాను విడుదల చేయలేదు. కలెక్షన్స్ షేరింగ్ విషయంలో మైత్రి, ప్రసాద్స్ మద్య వివాదం రాజుకుంది. సినిమా విడుదల ముందు వరకు అన్ని విషయాలు సర్దుకుంటాయని అనుకున్నారు. కానీ సినిమాలో బన్నీ చెప్పినట్లుగా తగ్గేదేలే అంటూ ఇటు మైత్రి వారు, అటు ప్రసాద్స్ వారు ఉండటంతో పుష్ప 2 సినిమా అందులో పడలేదు.
ఈ విషయాన్ని గురించి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వారు అధికారికంగా ప్రకటించారు. ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యంకు చింతిస్తున్నాం అంటూ ఒక ప్రెస్ నోట్‌ను సైతం విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న అన్ని మల్టీప్లెక్స్ యాజమాన్యం వారు డిస్ట్రిబ్యూటర్స్ కి గ్రాస్ కలెక్షన్స్ నుంచి 55% ఇచ్చేందుకు అంగీకరించినా ప్రసాద్స్ వారు మాత్రం 52% కంటే ఎక్కువ ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పిందట. అందుకే సినిమా విడుదల విషయంలో ఇరు వైపుల అనుకూలంగా లేకపోవడంతో ప్రసాద్స్‌లో విడుదల కాలేదు.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల విడుదల ఉంటే ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వద్ద పండుగ వాతావరణం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అలా లేదు. అక్కడ చాలా సైలెంట్‌గా ఉంది. గత 20 ఏళ్లుగా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ రోజు ఇంత ఖాళీగా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఉండటం ఇదే ప్రథమం అంటూ స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారికి ప్రభుత్వం పెద్ద ఎత్తున టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అవకాశం ఇచ్చినా ఆ కొత్త మొత్తం పర్సంటేజ్ కోసం సినిమా ప్రదర్శన ఆపేస్తారా అనే విమర్శలు వస్తున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాను మరీ కమర్షియల్ చేశారు, బిజినెస్‌గా మార్చారు అంటూ కొందరు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే కొందరు మాత్రం ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇతర మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఇచ్చేందుకు ఒప్పుకున్న 55% శాతంను మీరు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ విమర్శలు చేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో పుష్ప 2 సినిమాను చూసి ఎంజాయ్ చేయాలి అనుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లుగా ఇరువైపుల వారు వ్యవహరించారు. వీకెండ్ వరకు అయినా ఈ వివాదం కొలిక్కి వస్తుందా అంటే అనుమానమే అనే అంటున్నారు.