పుష్ప 2 రెమ్యునరేషన్స్.. అందరికి ఎంతెంత ఇచ్చారంటే..
ఇక మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా సుకుమార్, దేవిశ్రీప్రసాద్, రష్మిక కెరీర్ లో కూడా అత్యంత భారీగా విడుదల కాబోతున్న సినిమా పుష్ప 2. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు కూడా ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. తప్పనిసరి ఈ సినిమాతో వెయ్యి కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అని మేకర్స్ గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు టికెట్ ధరలపై విమర్శలు వచ్చినా, బుకింగ్స్‌లో మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన పుష్ప సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మరింత పెద్ద స్థాయిలో విడుదల కానుంది.
ఈ సినిమా మేకింగ్ కు మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఆ తరువాత అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్లు భారీగా ఉండడం వల్ల ఈ సినిమా ఖర్చు మరింతగా పెరిగిందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ లెక్కన చూస్తే, మొత్తం బడ్జెట్‌లో సగం వరకు పారితోషికాలకే ఖర్చు అయిందని తెలుస్తోంది. మొదట అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలి. మొదటి భాగం విడుదలకి ముందు అతని పేరు ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు, కేరళ వరకు మాత్రమే పరిమితమై ఉండేది.
కానీ పుష్ప ప్రభంజనం తర్వాత అల్లు అర్జున్ పేరు ఉత్తరాదిలోనూ మారుమోగిపోయింది. ఈ దెబ్బతో సీక్వెల్ కోసం పారితోషికం బదులుగా లాభాల్లో వాటా తీసుకోవాలని బన్నీ నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంతో సుమారు రూ. 270 నుంచి రూ. 280 కోట్ల వరకు బన్నీకి అందిందని సమాచారం. దీంతోపాటు, దర్శకుడు సుకుమార్ ఈ సారి రెమ్యునరేషన్‌తో పాటు నిర్మాతగా కూడా భాగస్వామ్యమయ్యాడు.
సుకుమార్ రెమ్యునరేషన్ రూ. 100 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. హీరోయిన్ రష్మిక మందన్నకు రూ. 10 కోట్లు, విలన్ ఫాహద్ ఫాజిల్‌కు రూ. 8 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం. స్పెషల్ సాంగ్ లో మెప్పించిన శ్రీలీలకు రూ. 2 కోట్లు పారితోషికం అందించగా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రూ. 5 కోట్లకు పైగా అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తోంది.
అంతేకాదు, కీలక పాత్రల్లో నటించిన జగపతిబాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు కూడా తగినంతగా పారితోషికాలు అందించినట్లు సమాచారం. ఈ లెక్కన సినిమా కోసం మొత్తంగా సుమారు రూ. 600 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సగం బడ్జెట్ నటీనటుల పారితోషికాలకే ఖర్చయిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, ఈ ఖర్చు తిరిగి రావడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 1000 కోట్లకు పైగా ఉండటంతో పుష్ప 2 ఇప్పటికే లాభదాయకంగా మారిందని అంటున్నారు. ఇక థియేట్రికల్ రిలీజ్ ద్వారా మరింత పెద్ద రికార్డులను సెట్ చేస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.