పుష్ప ఈవెంట్.. ఆ ఒక్క ఫొటోనే వణుకు పుట్టిస్తోంది
సినిమా ప్రమోషన్లకు కొత్త పుంతలు తొక్కుతూ, పుష్ప 2 టీం పాట్నాలో ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించింది.
సినిమా ప్రమోషన్లకు కొత్త పుంతలు తొక్కుతూ, పుష్ప 2 టీం పాట్నాలో ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించింది. బీహార్‌లోని పాట్నాను ఈ వేడుకకు వేదికగా ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ముంబయి, ఢిల్లీ వంటి మెట్రోపోలిస్ నగరాల్లో ట్రైలర్ లాంచ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల దృష్టిని ఆకర్షించేందుకు ఈ ప్రయత్నం చేశారు.
పాట్నాలో జరిగిన ఈ ఈవెంట్ మహాత్మ గాంధీ మైదానంలో భారీగా జరిగింది. ఆడియో వేడుకల స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు. మధ్యాహ్నం నుంచే భారీ జనసమూహం చేరుకున్న ఈ ఈవెంట్, సాయంత్రం కల్లా అంతకంతకూ జనంతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా పుష్ప 2 పోస్టర్లు, పాటలు, అభిమానుల కేరింతలతో మైదానం దద్దరిల్లింది. సుమారు 2 లక్షల మంది రాగా, 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేటు సెక్యూరిటీ సభ్యులు ఉన్నప్పటికీ, జనాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది.
అల్లు అర్జున్ వేదికపైకి రావడాన్ని తిలకించేందుకు అభిమానులు టవర్‌ల పైకి ఎక్కడం, ఒక దశలో భయాన్ని కలిగించింది. ఏమాత్రం పట్టు జారినా ఊహించని ఘటనలు చోటుచేసుకునేవి. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ లో ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు చేయరో ఈ విజువల్స్ ద్వారా అర్ధమవుతుంది. ఎందుకంటే జనాలను కంట్రోల్ చేయడం మామూలు టాస్క్ కాదు. ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది.
పుష్ప ట్రైలర్ ఈవెంట్ లో కొన్ని దశల్లో ఆందోళనకరంగా మారడంతో సెక్యూరిటీ వాళ్ళు తెలివిగా కంట్రోల్ చేశారు. ఇక కొన్ని చోట్ల జనసమూహం అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు అభిమానులు రాళ్లు, చెప్పులు విసరడం వంటి దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అనేది కలిసొచ్చింది.
ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాకు ఈ స్థాయిలో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్స్ చెబుతూ, పాట్నా ప్రజలపై ప్రత్యేక ప్రేమ వ్యక్తం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరగడం ఖాయం. మొత్తానికి, పాట్నాలోని ఈ కార్యక్రమం సినిమా ప్రమోషన్లకు కొత్త దిశానిర్దేశం చేసిందనడంలో సందేహం లేదు. అలాగే నెక్స్ట్ టైమ్ చేయాలి అంటే కొంత భయాన్ని కూడా కలిగిస్తోంది. మరి పుష్ప రేంజ్ లో నెక్స్ట్ ఏ సినిమా ఈవెంట్ జరుగుతుందో చూడాలి.