పుష్ప-3కి లీడ్ ఓకే.. మరి నెక్స్ట్ ఏంటి?

పుష్ప-1 ది రైజ్.. పుష్ప-2 ది రూల్.. మరి పుష్ప-3 సంగతేంటి? కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది.

Update: 2024-10-26 05:42 GMT

పుష్ప-1 ది రైజ్.. పుష్ప-2 ది రూల్.. మరి పుష్ప-3 సంగతేంటి? కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టేసింది. బన్నీ క్రేజ్ ను వేరే లెవెల్ లోకి తీసుకెళ్ళింది. ఆయనకు నేషనల్ అవార్డ్ ను తెచ్చిపెట్టింది. అదే సమయంలో సెకండ్ పార్ట్ పై మంచి హోప్స్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు పుష్ప-2 రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకోసం సినీ ప్రియులతో పాటు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ రెండు పార్టులు హిట్స్ అయ్యాక మూడో పార్ట్ కోసం చర్చలు జరగడం కామనే. బాహుబలి-3, కేజీఎఫ్-3 కోసం ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే పుష్ప-2 రిలీజ్ కాకముందే పుష్ప-3పై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది.

ఇది వరకే మూడో భాగం రానుందని వార్తలు రాగా.. రీసెంట్ గా నిర్మాత రవిశంకర్ కన్ఫర్మ్ చేశారు. కచ్చితంగా మూడో భాగం ఉంటుందని.. అందుకు కావాల్సిన లీడ్ పుష్ప-2లో ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అయితే థర్డ్ పార్ట్ ఉంటుందని తేల్చేశారు! మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుంది? బన్నీ ఏం అంటున్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే వాస్తవానికి పుష్ప ఒక్క సినిమాగానే తీసుకురావాలనుకున్నారు మేకర్స్. కానీ అనుకున్న స్టోరీ పెద్దగా అవ్వడంతో సీక్వెల్ తీస్తామనుకున్నారు. దీంతో రెండు సినిమాలు కలిపి మొత్తం మూడేళ్లలో కంప్లీట్ చేద్దామని అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యారట. కానీ మొత్తం ఐదేళ్లు అయిపోతుందన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పుడు పుష్ప-3ని వెంటనే స్టార్ట్ చేయడానికి రెడీగా లేరని తెలుస్తోంది. పెద్ద బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

పుష్ప-2 అయ్యాక త్రివిక్రమ్ తో వర్క్ చేయాల్సి ఉంది. వేరే డైరెక్టర్స్ కు కూడా ఆయన మాట ఇచ్చారు. అదే సమయంలో సుకుమార్.. రామ్ చరణ్ తో సినిమా చేయాల్సి ఉంది. అది కంప్లీట్ అవ్వడానికి రెండేళ్లు పడుతుంది! అటు అల్లు అర్జున్ కూడా ఖాళీ అవ్వడానికి టైమ్ పడుతుంది. దీంతో పుష్ప-3కి లీడ్ ఉన్నా.. ఇప్పట్లో సినిమా తెరకెక్కే ఛాన్స్ లేదు. మరి పుష్ప-3 ఎప్పుడు మొదలవుతుందో? మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News