సగం చూసి వెళ్లిపోతే 'టికెట్ డబ్బులు' వాపసు
మునుముందు ప్రజల అవసరాలకు తగ్గట్టు నిర్భంధ సినిమా వీక్షణ కాకుండా, సౌకర్యాన్ని బట్టి వీక్షణ విధానాన్ని తీసుకొస్తున్నట్టు పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది.
డిజిటల్ యుగంలో సినిమా వీక్షణ విధానం పూర్తిగా మారిపోయింది. ప్రజలు మొబైల్ ఫోన్‌లోనే సినిమాలు, వెబ్ షోలు చూస్తున్నారు. ఓటీటీ వీక్షణ స్మార్ట్ ఫోన్ తో చాలా సులువుగా మారింది. ఈ పరిస్థితుల్లో సినిమాలు చూసేందుకు జనం థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. పుష్పరాజ్ రేంజులో ఏదైనా ప్రత్యేకత ఉంది అనుకుంటే తప్ప బుక్ మై షో, ఆన్ లైన్ పోర్టళ్లలో టికెట్లు తెగడం లేదు.
అమెరికా తరహాలో `సినిమా పాస్` విధానాన్ని ఇప్పటికే మల్టీప్లెక్సులు అమలు చేస్తున్నాయి. నెలలో సినిమాల వీక్షణను పెంచేందుకు, జనాల్ని థియేటర్లకు రప్పించేందుకు బల్క్ బుకింగ్ లతో ఉచిత టికెట్లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రముఖ మల్టీప్లెక్సులు ఇంకా ఇలాంటి ఇన్నోవేటివ్ విధానాల కోసం ప్రయత్నిస్తున్నాయి.
మునుముందు ప్రజల అవసరాలకు తగ్గట్టు నిర్భంధ సినిమా వీక్షణ కాకుండా, సౌకర్యాన్ని బట్టి వీక్షణ విధానాన్ని తీసుకొస్తున్నట్టు పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. `FLEXI షో` అనే కొత్త విధానాన్ని పీవీఆర్ పరిచయం చేస్తోంది. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు షో నుంచి మధ్యలోనే వెళ్లిపోవాలనుకుంటే, వీక్షణ శాతాన్ని బట్టి తిరిగి టికెట్ డబ్బులు వెనక్కి చెల్లించే విధానాన్ని ప్రయోగాత్మకంగా పీవీఆర్ అమలు చేస్తోంది. FLEXI షో టికెటింగ్ మోడల్ టైమ్ బేస్డ్ రీఫండ్ సిస్టమ్‌ను పరిచయం చేస్తుంది. ప్రేక్షకులు తమకు సినిమా నచ్చకపోయినా లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి ఉన్నా షో మధ్యలో వదిలి వెళ్లిపోవచ్చు.
థియేటర్ వదిలి వెళ్లేప్పటికి సినిమాలో 75 శాతం కంటే ఎక్కువ మిగిలి ఉంటే, ఆడియెన్ వారి టిక్కెట్ ధరలో 60 శాతం తిరిగి పొందుతారు. మిగిలిన 50-75 శాతం కోసం 50 శాతం వాపసు ఇస్తారు. 25-50 శాతం సినిమా మిగిలి ఉంటే 30 శాతం వాపసు చెల్లిస్తారు. ఇది ఫ్యామిలీ అవసరం రీత్యా వెళ్లిపోతున్నా, లేదా ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని వెళ్లిపోవాలనుకున్నా.. వీక్షకులు తమ టిక్కెట్ ఖర్చు పరంగా ఎప్పుడూ లాక్ అయిపోవాల్సిన పని లేదు. న్యూ ఢిల్లీ , గుర్గావ్‌లోని 40 సినిమా థియేటర్లలో ఈ ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. మునుముందు దేశవ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు పీవీఆర్ ప్రయత్నిస్తోంది. ప్రేక్షకుడు సీటులోంచి వెళ్లేప్పటికి గంట షో చూశారా? అరగంట షో చూశారా? సగం కంటే ఎక్కువ సినిమా చూసారా? అనేది నిర్ణయించేందుకు శక్తివంతమైన కెమెరాలు, ఏఐ వ్యవస్థ పని చేస్తుందని సమాచారం.
ప్రజల మారుతున్న జీవన శైలికి తగ్గట్టు పీవీఆర్ ఈ ఫ్లెక్సీ వీక్షణ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రజల టైమ్ చాలా విలువైనది. వారు తమ అవసరాలకు తగ్గట్టు ఉంటారు. వినోదం అనేది మధ్యలో వచ్చి వెళుతుంది. దానికోసం ప్రజలు ఎవరూ పనులు మానుకోవాల్సిన పని లేదని దీని అర్థం.