కచ్చితంగా గెలుస్తా: రాజ్ తరుణ్

ఇప్పుడు మీడియా ప్రతినిధుల నుంచి లావణ్య ఆరోపణలు, ఫిర్యాదుల వ్యవహారంపై ఆయనకు తన అప్ కమింగ్ మూవీ భలే ఉన్నాడే మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రశ్న ఎదురైంది.

Update: 2024-09-03 05:22 GMT

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం ఎలాంటి మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. రోజుకొక ఆరోపణ చేసిన లావణ్య.. పోలీసులను కూడా ఆశ్రయించింది. 2008 నుంచి రాజ్ తరుణ్ తో తనకు పరిచయం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. అక్కడి కొన్ని నెలలకు ప్రపోజ్ చేసి.. 2014లో పెళ్లి చేసుకున్నట్లుగా వెల్లడించింది. 2016లో తాను గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించాడని పోలీసులకు తెలిపింది లావణ్య.

హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పరిచయం అయ్యాక.. తనను దూరం పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత ఇదే విషయాన్ని మాల్వీని ప్రశ్నిస్తే.. ఆమె బ్రదర్ తనకు బెదిరించారని ఆరోపించింది. దీంతో రాజ్ తరుణ్ తోపాటు మాల్వీ, ఆమె సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మాల్వీ కూడా లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు ఆరోపణలు చేసినట్లు, ఆమెను తాను ఒక్కసారి కూడా కలవలేదని తెలిపింది.

ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ కు ఎప్పటికప్పుడు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ విషయం కోర్టులో ఉందని, అక్కడ తాను నిరూపించుకుంటానని ఓ పాడ్ కాస్ట్ లో ఇటీవల తెలిపారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం నచ్చదని చెప్పారు. ఇప్పుడు మీడియా ప్రతినిధుల నుంచి లావణ్య ఆరోపణలు, ఫిర్యాదుల వ్యవహారంపై ఆయనకు తన అప్ కమింగ్ మూవీ భలే ఉన్నాడే మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రశ్న ఎదురైంది.

లావణ్య వ్యవహారం గురించి తనకు చర్చించడం ఇష్టం లేదని తెలిపారు రాజ్ తరుణ్. ఆ విషయంపై ఇక ప్రశ్నలు అడగవద్దని మీడియాను కోరారు. న్యాయపరంగా తాను కోర్టులో కేసు గెలుస్తానని తెలిపారు. తాను ఏ తప్పు కూడా చేయలేదని మరోసారి చెప్పారు. న్యాయస్థానంలో తీర్పు వచ్చే వరకు.. తాను ఆమె గురించి మాట్లాడదలుచుకోలేదని తెలిపారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కామెంట్స్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే.. రాజ్ తరుణ్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 40 రోజుల్లో ఆయన నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాగా.. సెప్టెంబర్ 13వ తేదీన భలే ఉన్నాడే విడుదల కానుంది. శివసాయి వర్ధన్‌ తెరకెక్కించిన ఆ సినిమాను కిరణ్‌ కుమార్‌ నిర్మించారు. మనీషా కంద్కూర్‌ హీరోయిన్ గా నటించిన ఆ మూవీని దర్శకుడు మారుతి సమర్పించారు. మరి భలే ఉన్నాడేతో రాజ్ తరుణ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News