'రాజాసాబ్' డేట్ కు అజిత్ సినిమా..!
ఈ సంగతి అటుంచితే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని చిత్ర యూనిట్ తాజాగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ది రాజాసాబ్''. సూపర్ నేచురల్ అంశాలతో కూడిన రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని 2025 సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని చాలా రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు దీనికి పోటీగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ''గుడ్ బ్యాడ్ అగ్లీ''. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ భారీ సినిమా రూపొందుతోంది. దీనికి 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ముందు నుంచీ ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ చెబుతూ వచ్చారు. అయితే అజిత్ నటిస్తున్న 'విదా ముయార్చి' మూవీ రేసులోకి రావడంతో వెనక్కి తగ్గారు. ఆ సినిమా కూడా పొంగల్ కు రావడం లేదు. ఈ సంగతి అటుంచితే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని చిత్ర యూనిట్ తాజాగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.
అయితే ఆల్రెడీ ఏప్రిల్ 10వ తేదీన 'ది రాజా సాబ్' సినిమా వస్తుందని ప్రకటించగా.. ఇప్పుడు అదే డేట్ కు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాని లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ సినిమా రాదని క్లారిటీ వచ్చిన తర్వాతే మైత్రీ టీమ్ రిలీజ్ డేట్ ను ప్రకటించి ఉంటారనే కామెంట్లు కూడా వస్తున్నాయి. రాజాసాబ్ సినిమాకి సీజీ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' చిత్రాన్ని అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. ఇప్పుడు అజిత్ మూవీ కూడా రేసులోకి వచ్చింది. ఇప్పటికైతే ఒకే తేదీకి మూడు సినిమాలు షెడ్యూల్ చేయబడ్డాయి. రానున్న రోజుల్లో వీటిల్లో మార్పులు ఉంటాయేమో చూడాలి.
మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ''గుడ్ బ్యాడ్ అగ్లీ'' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అజిత్ కుమార్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకూ జీ, పూర్ణా మార్కెట్, ఎంతవాడు గానీ, గ్యాంబ్లర్, విదాముయార్చి వంటి చిత్రాల్లో నటించారు. సునీల్, అర్జున్ దాస్, రాహుల్ దేవ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇది నిర్మాతలకు ఫస్ట్ తమిళ్ ప్రాజెక్ట్. దాదాపు రూ. 270 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.