రాజాసాబ్ రిలీజ్ పై మారుతి ఓపెన్ అయ్యాడు.. కానీ..
ముఖ్యంగా గతేడాది డిసెంబరులోనే సినిమా థియేటర్లలోకి వస్తుందన్న ప్రచారం జరిగింది.;

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ హారర్ కామెడీ సినిమా ‘‘రాజా సాబ్’’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ మారుతి ప్రత్యేక స్టైల్ లో రూపొందిస్తున్న ఈ చిత్రం గత కొంతకాలంగా హైలైట్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ సినిమా విడుదల తేదీపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రశ్నలు వేస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా గతేడాది డిసెంబరులోనే సినిమా థియేటర్లలోకి వస్తుందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత విడుదల తేదీ ఏప్రిల్ 10 అని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ కి అనుకున్న డేట్ కి కూడా చివర దశలోకి వచ్చేసినప్పటికీ చిత్రబృందం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అంతేకాకుండా తాజా సమాచారం ప్రకారం దసరా, దీపావళి, డిసెంబర్, సంక్రాంతి వంటి అన్ని పండగ సీజన్లలో ఒకదానికొకటి వాయిదా పడుతూ వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతిని ట్యాగ్ చేస్తూ స్పందించమని కోరారు. ఇదే సందర్భంలో ప్రభాస్ ఆర్మీకి చెందిన ఓ యూజర్ ట్వీట్ చేస్తూ, “మీకు సంతృప్తి కలిగినప్పుడు సినిమా విడుదల చేయండి, కానీ ఒక ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తే చాలు. అభిమానులు మిమ్మల్ని ఒత్తిడిపెట్టరు,” అంటూ అభ్యర్థించారు.
ఈ ట్వీట్‌కు డైరెక్టర్ మారుతి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. “ఖచ్చితమైన సమాచారం కోసం ప్రొడక్షన్ టీం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బాధ్యత వహిస్తోంది. ప్రస్తుతం సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాము. అవి పూర్తి అయిన తర్వాత విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ రిలీజ్ విషయంలో అనేక రకాల అంశాలు కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒకరే తీసుకునే నిర్ణయం కాదు. అందరూ తమవంతు కృషి చేస్తున్నారు. కాస్త ఓర్పు ఉండండి,” అని మారుతి ట్వీట్ చేశారు.
మారుతి ట్వీట్‌తో ప్రస్తుతం ‘‘రాజా సాబ్’’ వాయిదాలపై ఉన్న అనుమానాలకు కొంతమేర సమాధానం లభించినట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఇంకా ఎదురు చూసే పరిస్థితి అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం టాకీ పార్ట్, నాలుగు పాటల షూటింగ్ మిగిలి ఉండగా, వాటితో పాటు గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ఖరారవుతుందని తెలుస్తోంది.
మొత్తానికి డైరెక్టర్ మారుతి స్పందనతో చిత్రంపై నమ్మకం పెరిగినా, విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేవరకు ఫ్యాన్స్ ప్రశ్నలు అలాగే కొనసాగనున్నాయి. ఇప్పటికైనా మేకర్స్ ఓ డేట్ ఫిక్స్ చేస్తే అభిమానులకు రిలీఫ్ కలిగినట్లే అవుతుంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే సినిమా అక్టోబర్ లేదా నవంబర్‌లో విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.