ఇండస్ట్రీలోకి మళ్లీ రాకుండా చట్టం తేవాలి: బీజేపీ ఎమ్మెల్యే

పరారీలో ఉన్న అతడిని గురువారం ఉదయం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-09-19 08:30 GMT

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ జూనియర్ కొరియోగ్రాఫర్ జానీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న అతడిని గురువారం ఉదయం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకొస్తున్నారు.

అయితే ఇప్పటికే జానీ మాస్టర్ వ్యవహారంపై అనేక మంది స్పందించారు. మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడడం, మతం మారాలంటూ ఒత్తిడి చేయడం.. వంటి విషయాలను ఖండిస్తున్నట్లు రీసెంట్ గా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్.. జానీ మాస్టర్ అరెస్ట్ కు కాసేపటి ముందు వీడియో రిలీజ్ చేశారు.

"నార్సింగ్ పోలీస్ అధికారులకు, కమిషనర్ గారికి నేను ఒక మాట అడుగుతున్నా. జానీ బాషా మాస్టర్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు?.. ఒక మహిళకు ఆయన ఏ విధంగా టార్చర్ చేశారో.. ఎలా ఇబ్బంది పెట్టారో! ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రజలు పోలీసులు వైపు చేస్తున్నారు. ఎప్పుడు అతడిని అరెస్టు చేస్తారోనని.. లవ్ జిహాదీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. నేను పోలీసులకు మరో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా" అని తెలిపారు.

"అరెస్ట్ అయిన తర్వాత.. ఆ ఒక్క అమ్మాయే కాకుండా ఇంకా ఎంత మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టాడో.. ఇంకెంత మందిని కన్వెర్ట్ అవ్వమని ఆఫర్ ఇచ్చాడో బయట పెట్టాలని కోరుతున్నా. ఇవాళ టాలీవుడ్ కు నల్ల మచ్చ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు జానీ మాస్టర్. అందుకే మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. టాలీవుడ్ ను క్లీన్ చేయాలని కోరుతున్నా. మహిళలను ఇబ్బంది పెట్టినా.. కన్వెర్ట్ అవ్వమని ఆఫర్ ఇచ్చినా.. వారు మరోసారి తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టకూడదని చట్టం తీసుకురావాలి" అని కోరారు.

ఈ విషయంలో ఇండస్ట్రీ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నానని తెలిపారు రాజాసింగ్. "ఎందుకంటే చాలా మంది ప్రజలు.. హీరో హీరోయిన్లను చూసి ఫాలో అవుతారు. కానీ జానీ మాస్టర్ లాంటి కొంతమంది వల్ల టాలీవుడ్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీ పెద్దలను కోరుతున్నా. జానీ మాస్టర్ పై ఇంటరాగేషన్ చేయాలి. పెద్ద నేరాలకు పాల్పడిన వారిలా పనిష్మెంట్ ఇవ్వాలి. మొత్తం విషయాన్ని పోలీసులు బయటకు తీసుకురావాలి" అని రాజాసింగ్ కోరారు.

Tags:    

Similar News