SSMB29: ఫ్యాన్స్ గొడవలు.. ఇది రాజమౌళి సమాధానం!

ఈ చిత్రానికి అధికారికంగా ఏ పేరు పెట్టబోతున్నారనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.;

Update: 2025-03-19 08:30 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గురించి ప్రతి చిన్న అప్‌డేట్ అభిమానుల్లో జోష్ పెంచుతోంది. గత కొంతకాలంగా ఈ చిత్రానికి సంబంధించి అనేక ఊహాగానాలు వినిపించాయి. జక్కన్న సెట్ చేసిన అడ్వెంచరస్ కథలో మహేష్ బాబు మునిగితేలబోతున్నారని, ఇది ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.


ఈ చిత్రానికి అధికారికంగా ఏ పేరు పెట్టబోతున్నారనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మొదట అభిమానులు దీనిని మహేష్ 29 అనే ట్యాగ్‌తో పిలిచారు. అయితే, కొంతమంది రాజమౌళి మార్క్‌ను చేర్చుతూ ‘SSRMB’ అనే కొత్త ట్యాగ్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడిచింది. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటివరకు ‘SSMB29’ అనే పేరును ఫిక్స్ చేసుకొని, అదే కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారు.

ఇక ఫ్యాన్స్ మధ్యలో చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ ట్యాగ్ గొడవకు ఫైనల్ గా జక్కన్న ద్వారా ఒక సమాధానం దొరికినట్లయ్యింది. మూవీ షూటింగ్ జరుగుతున్న ఒడిశాలో, లొకేషన్ టీమ్ అందించిన హాస్పిటాలిటీకి కృతజ్ఞతగా రాజమౌళి, మహేష్ బాబు కలిసి రాసిన లెటర్ వైరల్ అవుతోంది. ఆ లెటర్‌లో వారు “With love from the sets of #SSMB29” అని రాశారు. దీంతో ఇకపై ఈ ప్రాజెక్ట్ ‘SSMB29’ అనే పేరుతోనే పిలవబడనుందని ఫ్యాన్స్ ఖచ్చితంగా నమ్ముతున్నారు.

సినిమా టైటిల్, పోస్టర్ లాంటి అఫీషియల్ అప్‌డేట్స్ ఇంకా రాకపోయినా, సినిమా ప్రమోషన్ మొదలైనట్టే అనిపిస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఇది టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కెన్యా అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కనుందని, రెండు భాగాలుగా ప్లాన్ చేశారనే టాక్ హల్‌చల్ చేస్తోంది.

ఈ లెటర్‌తో మహేష్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. టైటిల్ ఫిక్స్ కాకపోయినా, సినిమా యొక్క అధికారిక ట్యాగ్ ‘SSMB29’ అని రాజమౌళి ముద్ర వేయడంతో, ఫ్యాన్స్ ఇకపై దీనిపై ఎలాంటి గందరగోళం ఉండదని భావిస్తున్నారు. మరి, ఈ ట్యాగ్‌కి తగ్గట్టుగా సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News