ఒడిశాలో రాజమౌళి, ఎందుకంటే!
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. మధ్యలో వారం రోజుల పాటు ఆర్‌ఆర్‌ఆర్ డాక్యుమెంటరీపై వర్క్ చేసిన రాజమౌళి ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో పడ్డారు. కొన్ని వారాల క్రితం సినిమా లొకేషన్స్ కోసం ఆఫ్రియాకు టీంతో కలిసి వెళ్లిన రాజమౌళి ఇప్పుడు ఒడిశాకు వెళ్లారు. అక్కడ కీలకమైన ఛారిత్రాత్మక ప్రదేశాల్లో సినిమా షూటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అందుకే వాటిని నేరుగా చూసి షూటింగ్‌కు ఎంత మేరకు అనుకూలం అనే విషయాలను రాజమౌళి పరిశీలించేందుకు వెళ్లడం జరిగిందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఒడిశాలో రాజమౌళి ల్యాండ్ అయ్యారని, మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా కోసం లొకేషన్స్‌ను చూసే పనిపై ఆయన వచ్చారు అంటూ స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒడిశాలో ఒక వ్యక్తి రాజమౌళికి పూల బొకే అందించి వెల్‌కమ్ చెబుతున్న ఫోటో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఒడిశాలో టీంతో కలిసి లొకేషన్స్‌లో రాజమౌళి పర్యటిస్తున్నారు. రెండు లేదా మూడు రోజుల పాటు రాజమౌళి అండ్ టీం అక్కడే ఉండబోతున్నారు అని, ఆయనకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్న వారు చెప్పారని స్థానిక మీడియాల్లో కథనాలు వచ్చాయి.
రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్నారు. గత ఏడాది కాలంగా ఆయన మహేష్ బాబు సినిమా కోసం కథను రెడీ చేసే పనిలో, ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాను 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా షూటింగ్ చాలా స్పీడ్‌గా చేస్తామంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటిని ఇప్పటికే ఈ సినిమా కోసం సంప్రదించారు అనే వార్తలు వచ్చాయి. కానీ జక్కన్న టీం నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన, క్లారిటీ రాలేదు అనే విషయం తెల్సిందే .
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయడం తో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి ఆస్కార్ అవార్డ్ వరకు తెలుగు సినిమాను తీసుకు వెళ్లగల సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రాజమౌళి, మహేష్ బాబు సినిమా గురించి కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా రాజమౌళి నుంచి అప్‌డేట్ అయితే రావడం లేదు. రెండు పార్ట్‌లుగా సినిమా ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.