ఆడియెన్స్ విషయంలో.. రాజమౌళి ఎంత క్లారిటీతో ఉన్నారంటే..
కేవలం రిలీజ్ అయ్యాక క్రియేట్ అవ్వబోయే రికార్డుల కోసం మాట్లాడుకుంటారు.
రాజమౌళి.. అపజయం ఎరుగని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. తన సినిమాలకు గొప్ప కథలను ఎంచుకునే జక్కన్న.. అంతే గొప్పగా తెరకెక్కిస్తారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆడియన్స్ ఫల్స్ తెలిసిన మాస్ డైరెక్టర్ ఆయన. రాజమౌళి సినిమా వస్తుందంటే మూవీ.. రిజల్ట్ కోసం ఎక్కడా చర్చ ఉండదు. కేవలం రిలీజ్ అయ్యాక క్రియేట్ అవ్వబోయే రికార్డుల కోసం మాట్లాడుకుంటారు.
ఇక బాహుబలి సిరీస్ చిత్రాలతో తెలుగు సినీ ఖ్యాతిని రాజమౌళి విశ్వవ్యాప్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ వరల్డ్ హిట్ కొట్టారు. ఆస్కార్ అవార్డును తీసుకొచ్చారు. అతిత్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేయనున్నారు. అంతకుముందు బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు జక్కన్న! డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా మే 17వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమౌళి మాట్లాడారు. సినిమాల విషయంలో ఇండియన్ ఆడియన్స్ ఛాయిస్ ను ప్రస్తావించారు. 'బాహుబలి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉంటే.. దాదాపుగా 120 కోట్ల మంది సినిమాలు చూస్తారనుకుందాం. కానీ బాహుబలిని థియేటర్ లో చూసింది 10 కోట్ల మంది మాత్రమే' అని తెలిపారు.
'అంటే బాహుబలి మూవీకి 10 కోట్ల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీని బట్టి చూస్తే.. దేశంలోని 110 కోట్ల మంది థియేటర్ లో చూడలేదు. టీవీలో లేదా ఓటీటీలో సినిమాను చూసి ఉంటారు. మనం సినిమాల ప్రపంచంలో బతుకుతున్నామని అనుకుంటాం. అందరూ సినిమాలు చూస్తారని అనుకుంటాం కానీ అది నిజం కాదు. భారతదేశంలో సినిమా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ పుస్తకాలు, నవలలు, కామిక్స్, ఇతర మాధ్యమాల ద్వారా కూడా కథలు తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు' అని చెప్పారు.
అయితే కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా నచ్చుతుందని తెలిపారు రాజమౌళి. అందరూ రెగ్యులర్ సినిమాలు చూడరని, కేవలం యానిమేషన్ మూవీలను మాత్రమే ఆస్వాదించేవాళ్లు కూడా ఉంటారని తెలిపారు. ఆ ఆలోచనతోనే బాహుబలిని ఈ యానిమేషన్ సిరీస్ రూపంలో తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇది బాహుబలి ప్రీక్వెల్ కాదని, సీక్వెల్ కూడా కాదని చెప్పారు. బాహుబలి కథ మధ్యలో ఏం జరిగిందన్నది ఈ సిరీస్ లో అంతా త్వరలో చూస్తారని తెలిపారు. మరి ఈ యానిమేషన్ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి.