ఏంటీ.. స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ చేస్తున్నారా?
రాజీవ్ మీనన్ ఇక్కడ ఎవరి పేరునూ ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, చివరగా 'విడుదల 2' సినిమాలో నటిచడంతో దర్శకుడు వెంట్రిమారన్ గురించే ఈ కామెంట్స్ చేసి ఉంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు భావిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం డైరెక్ట్ చేసిన 'బొంబాయి' 'గురు' 'కడలి' వంటి క్లాసిక్ సినిమాకు ఆయనే సినిమాటోగ్రఫీ నిర్వహించారు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో యాక్టింగ్ కూడా చేసిన రాజీవ్.. ఇటీవల విడుదలైన 'విడుదల 2' చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. అయితే రాజీవ్ మీనన్ తాజాగా ఓ తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోలీవుడ్ డైరెక్టర్లు ప్లానింగ్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
తమిళ సినీ పరిశ్రమ ప్లానింగ్ చేసుకోలేని స్థితికి చేరుకుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు షూటింగ్ చేసుకోవచ్చు అనే ధోరణిలో ఫిలిం మేకర్స్ ఉన్నారని రాజీవ్ మీనన్ పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు ఇప్పుడు తమ సినిమాలను ఏడాదిన్నర పాటు చిత్రీకరిస్తున్నారని, ఇది పరిశ్రమకు అస్సలు ఆరోగ్యకరమైనది కాదని, ఎందుకంటే అందులో చాలా డబ్బు ముడిపడి ఉంటుందని అన్నారు. షూటింగ్ కి వెళ్ళడానికి ముందు దర్శకుల దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉండటం లేదు. సరైన ప్లానింగ్ లేకుండా షూటింగ్ చేస్తున్నప్పుడే స్క్రిప్టును మార్చేస్తున్నారు అని రాజీవ్ తెలిపారు.
'బొంబాయి' సినిమాని మణిరత్నం రెండు నెలల్లో పూర్తి చేసారు. 'జురాసిక్ పార్క్' లాంటి హాలీవుడ్ మూవీని 78 రోజుల్లో చేయాలని ప్లాన్ చేసి, 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసారు. కానీ మన పరిశ్రమలో మాత్రం కొంతమంది ఫిలిం మేకర్స్ చిన్న బడ్జెట్ సినిమాలను కూడా సరైన ప్రణాళిక లేకుండా చాలా కాలం పాటు చిత్రీకరిస్తున్నారని రాజీవ్ మీనన్ చెప్పారు. మనం సినిమాని ప్లాన్ చేస్తున్న విధానంలో, డిజైన్ చేస్తున్న విధానంలో ఏదో తీవ్రమైన తప్పు ఉందని నేను భావిస్తున్నాను. ఇలా సరైన ప్లానింగ్ లేకుండా అలసత్వం వహించడం వల్ల నిజంగా బాధపడే ఏకైక వ్యక్తి ప్రొడ్యూసర్. ఈ కారణంగానే కోలీవుడ్‌లో నిర్మాతల కొరత ఏర్పడుతోంది. తగినంత మంది నిర్మాతలు లేకపోవడం వల్ల తమిళ సినిమా ఇబ్బందుల్లో ఉందని రాజీవ్ అభిప్రాయపడ్డారు.
రాజీవ్ మీనన్ ఇక్కడ ఎవరి పేరునూ ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, చివరగా 'విడుదల 2' సినిమాలో నటిచడంతో దర్శకుడు వెంట్రిమారన్ గురించే ఈ కామెంట్స్ చేసి ఉంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు భావిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెంట్రిమారన్ 'విడుదల 1' సినిమా రిలీజైన తర్వాత, పార్ట్-2 సెట్స్ మీద ఉన్నప్పుడు స్క్రిప్ట్ లో చేంజెస్ చేసినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే షూటింగ్ ఎక్కువ రోజులు జరిగిందని, సినిమాల విడుదలలో జాప్యం జరిగిందనే టాక్ ఉంది. అందుకే ఇప్పుడు రాజీవ్ కామెంట్స్ ను ఆయనకు లింక్ చేస్తున్నారు. ఇదే నిజమైతే ఇప్పటినుంచైనా ఫుల్ బౌండెడ్ స్క్రిప్టుతో సెట్స్ మీదకు వెళ్లాలని, ప్రీ-ప్రొడక్షన్‌లోనే సరైన ప్లానింగ్ తో సినిమాను పూర్తి చేయాలని దర్శకుడికి సూచిస్తున్నారు.
ఇకపోతే కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'చైతన్య' (1991) సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమైన రాజీవ్ మీనన్.. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో వర్క్ చేయలేదు. హిందీ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఎక్కువగా పని చేసారు. 'సర్వం తాళ మయం' సహా నాలుగు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రాజీవ్.. 'విడుదల 1' & 'విడుదల 2' చిత్రాల్లో నటించారు.