చిరంజీవి కోసం చిన్న నిర్మాత టైటిల్ దానం!
దానికనుగుణంగానే నిర్మాతలు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
నచ్చిన సినిమా టైటిల్స్ ముందుగానే నిర్మాతల మండలిలో రిజిస్టర్ చేయించు పెట్టుకుంటారన్న సంగతి తెలిసిందే. అలాంటి టైటిల్స్ అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మ్యాచ్ అవుతుంటాయి. అలాంట ప్పుడు ముందుగా టైటిల్ ఎవరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్లకే చెందుతుంది. అక్కడ కచ్చితంగా చాంబర్ నియమ నిబంధనల పనిచేస్తాయి. దానికనుగుణంగానే నిర్మాతలు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
పెద్ద సినిమా టైటిల్స్ క్లాష్ ఏర్పడినప్పుడు మాత్రం వీలైనంతవరకూ మార్చే అవకాశం ఉండదు. చిన్న నిర్మాత అనుమతితో అదే టైటిల్ పెట్టుకునేలా నిర్మాతని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ చిన్న సినిమా నిర్మాత తన టైటిల్ ని దానం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మాత రాజేందర్ రెడ్డి `సింబా` అనే సినిమాతో ఆగస్టు 9న రాబోతున్నారు.
ఇందులో జగపతి బాబు- అనసూయ ముఖ్య పాత్రలు పోషించారు. పర్యావరణం ప్రాధాన్యత ఆధారంగా ఈ చిత్రాన్నితెరకెక్కించారు. అయితే ఈసినిమాకి తొలుత `గాడ్ ఫాదర్` అనే టైటిల్ పెట్టారుట. కానీ అదే సమయంలో చిరంజీవి సినిమాకి కూడా `గాడ్ ఫాదర్` టైటిల్ అనుకున్నారు. దీంతో చిరంజీవి అడిగారు అన్న కారణంగా తన టైటిల్ ఆయనకు ఇచ్చేసినట్లు రాజేందర్ రెడ్డి తెలిపారు.
`మేము ఆ తర్వాత కథకు తగ్గట్టు సింబా అనే టైటిల్ పెట్టుకున్నాము` అని తెలిపారు. గాడ్ ఫాదర్ సినిమా మలయాళం హిట్ `లూసిఫర్` కి రీమేక్ గా మోహన్ రాజా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య `గాడ్ ఫాదర్` సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చినా వాటిని అందుకోవడంలో విఫలమైంది.