ఇంటికెళ్తే ఎందుకొచ్చావ్ అని నాన్న కోప‌గించుకున్నారు!

తాజాగా న‌ట కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్ ప్ర‌స్థానం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

Update: 2024-11-30 07:00 GMT

సినిమా ఇండస్ట్రీకి వ‌చ్చి స‌క్సెస్ అయిన వారంతా ఎన్నో క‌ష్టాలు..ఒడిదుడుల‌కు ఎదుర్కున్న‌వారే. క‌ష్ట‌మైనా ఇష్ట‌ప‌డి పనిచేసారు కాబ‌ట్టే స‌క్సెస్ అయ్యారు. తాజాగా న‌ట కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్ ప్ర‌స్థానం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'మానాన్న స్కూల్ టీచర్. చాలా క‌ఠినంగా ఉండేవారు. ఇంజ‌నీరింగ్ అయిన వెంట‌నే సినిమాల్లోకి రావాల‌నుకున్నా. అందుకు ఆయ‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసారు.

నీ ఇష్టానికి వెళ్తున్నావ్. అక్క‌డ స‌క్సెస్ రావొచ్చు..ఫెయిల్యూర్ రావొచ్చు. అది నీకు సంబంధించిన విష‌యం. ఒక‌వేళ ఫెయిలైతే ఇంటికి రావొద్దు అన్నారు. ఆ మాట నాపై చాలా ప్ర‌భావం చూపింది. మ‌ద్రాస్ వ‌చ్చి ఫిల్మ్ ఇన్ స్ట్యూట్ లో చేరా. గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చింది. కానీ సినిమాల్లో అవ‌కాశం మాత్ర రాలేదు. వేషాలు వ‌చ్చే గ్లామ‌ర్ నాది కాద‌ని తెలుసు. ఆ స‌మ‌యంలో ఇంటికి తిరిగి వెళ్లాను. ఎందుకు వ‌చ్చావ్‌? రావొద్దు అన్నాను క‌దా? అని నాన్న కోప‌డ్డారు.

బాధ‌గా అనిపించి వెంట‌నే మ‌ద్రాస్ కి వ‌చ్చేసా. చ‌నిపోదాం అనుకున్నా. నా ఆత్మీయులంద‌రిని చూడాల‌నిపించి వాళ్ల‌ని క‌లిసి మాట్లాడా. చివ‌రిగా నిర్మాత పుండ‌రీకాక్ష‌య్య గారికి ఇంటికి వెళ్లాను. అక్క‌డ 'మేలు కోలుపు' సినిమాకు సంబంధించి ఏదో గొడ‌వ జ‌రుగుతుంది. ఆఫీస్ రూమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి న‌న్ను చూసి ఏం మాట్లాడ‌కుండా న‌న్ను డ‌బ్బింగ్ రూమ్ కి తీసుకెళ్లారు. ఓ సీన్ కి నాతో డబ్బింగ్ చెప్పించారు.

అది ఆయ‌న‌కు న‌చ్చి స‌మ‌యానికి భ‌లే దొరికావ్ అన్నారు. రెండ‌వ సీన్ కి డ‌బ్బింగ్ చెప్ప‌మ‌నగానే నా ప‌రిస్థితి చెప్పాను. భోజ‌నం చేసి మూడు నెల‌లు అయింది. భోజ‌నం పెడితే డ‌బ్బింగ్ చెబుతాన‌న్నా. అవ‌కాశాలు రాక ఆత్మ హ‌త్య చేసుకోవాల‌నుకున్నా అని చెప్పా. దానికి ఆయ‌న కోప్ప‌డ్డారు. ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి, ధైర్యం చెప్పారు. అలా నా డ‌బ్బింగ్ ప్ర‌యాణం మొద‌లైంది. చాలా సినిమాల‌కు డ‌బ్బింగ్ చెప్పాను. వ‌చ్చిన డ‌బ్బుతో మ‌ద్రాస్ లో ఇల్లు క‌ట్టాను. అక్క‌డే ద‌ర్శ‌కుడు వంశీ పరిచ‌యం అయ్యాడు. అత‌డి సినిమాల‌తో హీరోగా గుర్తింపు వ‌చ్చింది' అన్నారు.

Tags:    

Similar News