తప్పైంది క్షమించండి.. ఐ లవ్ వార్నర్
నితిన్- శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాబిన్‌హుడ్.;
నితిన్- శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాబిన్‌హుడ్. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించగా, ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిన్న క్యామియో చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా వార్నర్ చీఫ్ గెస్టుగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా అందులో రాజేంద్ర ప్రసాద్ వార్నర్ పై అనుకోకుండా నోరు జారడంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో బాగా రచ్చ జరుగుతోంది.
ఈ విషయం వల్ల సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ తో పాటూ రాబిన్‌హుడ్ టీమ్ పై కూడా బాగా వ్యతిరేకత రావడంతో రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంపై స్పందించి, వార్నర్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్తూ వీడియోను రిలీజ్ చేశారు. మొన్న ఈవెంట్ లో వార్నర్ గురించి మాట్లాడుతూ ఓ మాట దొర్లిందని, తాను కావాలని ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని ఆయన అన్నారు.
ఆ ఫంక్షన్‌కు ముందు అందరం కలిసి ఎంతో అల్లరి చేశామని, నితిన్, వార్నర్ ను నా పిల్లలు లాంటోళ్లని అన్నానని, అంతేకాకుండా నువ్వు సినిమాల్లోకి వస్తున్నావ్ కదా రా నీ సంగతి చెప్తా అంటే, దానికి వార్నర్ మీరు క్రికెట్ లోకి రండి మీ సంగతి చెప్తా అన్నాడని, ఇలా చాలా సేపు కలిసి సరదాగా మాట్లాడుకున్నామని, ఆ తర్వాత స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడేటప్పుడు తన నోటి నుంచి ఆ మాట దొర్లిందని రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు.
అంతేకాదు, ఐ లవ్ డేవిడ్ వార్నర్, ఐ లవ్ హిజ్ క్రికెట్, అలానే ఆయన కూడా మన సినిమాల్ని, మన యాక్టింగ్ ను ఎంతో ఇష్టపడతాడని, మేమంతా ఒకరికొకరం బాగా క్లోజ్ అయ్యామని, ఏదేమైనా జరిగిన సంఘటన ఎవరినైనా బాధ పెడితే క్షమించండి అని కోరిన ఆయన ఇంకెప్పుడూ ఇలాంటివి జరగవని, జరక్కుండా చూసుకుంటానని అన్నారు.
మార్చి 27న రిలీజ్ కానున్న ఈ సినిమా కు చిత్ర మేకర్స్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. నితిన్, వెంకీ, శ్రీలీల ఈ సినిమా సక్సెస్ పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వార్నర్ ను కేవలం సినిమాలో చిన్న క్యామియోకే పరిమితం చేస్తారనుకుంటే ప్రమోషన్స్ లో కూడా రాబిన్‌హుడ్ టీమ్ ఆయన్ను గట్టిగా వాడేస్తుంది. మరి కొద్ది గంటల్లోనే రాబిన్‌హుడ్ ఫలితం రాబోతుంది.