వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో: రాజేంద్రప్రసాద్

ఈరోజుల్లో 'హీరో' మీనింగ్ మారిపోయిందని అంటున్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.

Update: 2024-12-09 18:07 GMT

ఈరోజుల్లో 'హీరో' మీనింగ్ మారిపోయిందని అంటున్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలలో హీరోల క్యారక్టరైజేషన్ లో చాలా మార్పులు వచ్చాయని, నెగెటివ్ రోల్స్ ను కూడా జనాలు ఆదరిస్తున్నారనే ఉద్దేశ్యంతో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా మీద పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ''చందనం దుంగల్ని దొంగతనం చేసే దొంగ.. వాడు హీరో'' అంటూ తాజాగా రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'హరికథ' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు తీసుకుంటే.. నిన్నగాక మొన్న చూసాం. వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో. హీరోల్లో మానింగులు మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే, నేను 48 సంవత్సరాలుగా సమాజనంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ తో డిఫెరెంట్ హీరో అనిపించుకున్నాను. 'లేడీస్ టైలర్'లో హీరో ఒక సన్నాసి.. 'అప్పుల అప్పారావు' 'పేకాట పాపారావు' సినిమాల్లో వాడు హీరోనా?.. 'ఏప్రిల్ 1 విడుదల' లో హీరో ఒక దొంగ. కానీ సమాజంలో మన చుట్టూ, మనతో పాటు మన పక్కనే ఉన్న అలాంటి క్యారెక్టర్స్ తీసుకొని, హీరోగా నటించి ఇంతకాలం మీ ముందు ఉన్నాను” అని అన్నారు. ఇప్పుడు 'హరికథ' సినిమాలోనూ మంచి పాత్ర పోషించినట్లుగా ఆయన తెలిపారు. ఏఎన్నార్, ఎన్టీఆర్ చేయాల్సిన పాత్ర తనకు దక్కడం సంతోషంగా ఉందని.. హరికథలు చెబుతూ జీవితాంతం హరి నామస్మరణ చేసే రంగాచారి పాత్రలో కనిపిస్తానని అన్నారు.

అయితే రాజేంద్రప్రసాద్ ఉదాహరణగా చెప్పిన సినిమా 'పుష్ప' అనే సంగతి అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్ర ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తుంటుంది. అలాంటి క్యారక్టర్ లో నటించిన అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ ఇవ్వడంపైనా అప్పట్లో సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఇప్పుడు రాజేంద్రప్రసాద్ కూడా చందనం దుంగల దొంగని హీరోగా చూపించారనే ఉద్దేశ్యంతోనే అలాంటి వ్యాఖ్యలు చేసారు. కాకపోతే ఆయన ఇక్కడ ఏదో కావాలని బన్నీని టార్గెట్ చేయాలనో, లేదా పుష్ప సినిమాని తక్కువ చేయాలనో ఇలా మాట్లాడలేదు. ఈరోజుల్లో సినిమాలలో హీరోల పాత్రలు ఎలా ఉంటున్నాయనే దాన్ని వివరించడానికే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ తో రాజేంద్రప్రసాద్ కి మంచి అనుబంధం ఉంది. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అల వైకుంఠపురములో' వంటి చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుమార్తె చనిపోయినప్పుడు బన్నీ ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించి, ధైర్యం చెప్పి వచ్చారు. కాబట్టి పుష్పరాజ్ పాత్రను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ పరోక్షంగా మాట్లాడిన మాటలను సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి పాత సినిమాలలో హీరోల పాత్రలు చాలా పాజిటివ్ గా, రాముడు మంచి బాలుడు అనే టైపులో ఉండేవి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఉన్నా, క్లైమాక్స్ లో చనిపోయేలా దర్శకులు డిజైన్ చేసేవారు. కానీ రానురాను సినిమాల్లో 'హీరో' అనే దానికి అర్థం పూర్తిగా మారిపోయింది. ఇడియట్, పోకిరి, లోఫర్, రోగ్, జులాయి, యానిమల్.. ఇలాంటి పాత్రలే ఇప్పుటి చిత్రాల్లో 'హీరో'లుగా చిత్రీకరించబడుతున్నాయి. జనాలు కూడా అలాంటి హీరో పాత్రలనే తెర మీద చూడటానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఫిలిం మేకర్స్ అందరూ హీరో క్యారెక్టర్స్ కాస్త నెగిటివ్ టచ్ ఇస్తూ వస్తున్నారు.

Tags:    

Similar News