వార్నర్ ఫ్యాన్స్.. నిన్నటిదాకా సపోర్ట్.. కానీ ఈ రోజు?

డేవిడ్ వార్నర్.. ఈ పేరు చెబితే తెలుగు క్రికెట్ అభిమానులు ఊగిపోతారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతూ అతను మామూలు ఫాలోయింగ్ సంపాదించలేదు.;

Update: 2025-03-24 09:19 GMT

డేవిడ్ వార్నర్.. ఈ పేరు చెబితే తెలుగు క్రికెట్ అభిమానులు ఊగిపోతారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతూ అతను మామూలు ఫాలోయింగ్ సంపాదించలేదు. కేవలం ఆటతోనే కాక తన వ్యక్తిత్వంతోనూ అతను ఆకట్టుకున్నాడు. పుష్ప సహా కొన్ని తెలుగు చిత్రాలకు సంబంధించిన రీల్స్‌తో అతను మన ఫ్యాన్స్‌ను కట్టి పడేశాడు. తెలుగు వాళ్లనే కాక మిగతా వాళ్లు కూడా వార్నర్‌ను ఎంతగానో అభిమానిస్తారు.

ఐపీఎల్‌లో ఆడే విదేశీ క్రికెటర్లలో అత్యంత ఆదరణ తెచ్చుకున్నది వార్నరే అంటే అతిశయోక్తి కాదు. ఈ ఫాలోయింగ్ చూసే ‘రాబిన్ హుడ్’ టీం వార్నర్‌తో ఇందులో ఒక క్యామియో రోల్ చేయించింది. అది ఇప్పటిదాకా సినిమాకు బాగానే ప్లస్ అయింది. నిన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వార్నర్‌ను ముఖ్య అతిథిగా పిలిచి.. దాన్ని ప్రమోషన్ కోసం బాగానే వాడుకుంది ‘రాబిన్ హుడ్’ టీం.

కానీ ఈ రోజు మాత్రం ‘రాబిన్ హుడ్’ టీం మీద వార్నర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా మీద నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు. అందుక్కారణం.. ఈ వేడుకలో వార్నర్‌ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లే. తన స్పీచ్‌లో భాగంగా వార్నర్ గురించి సరదాగా మాట్లాడుతూనే.. ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ డేవిడ్ వార్నరు.. నిన్ను క్రికెట్ ఆడవయ్యా అంటే స్టెప్స్ వేస్తున్నాడు. దొంగ ముండాకొడుకు. వీడు మామాలోడు కాదండీ వీడు. ఏయ్.. రేయ్ వార్నరూ..’’ అంటూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వార్నర్‌కు భాష తెలియనంత మాత్రాన అతిథిని పట్టుకుని ఈ మాటలేంటి అంటూ ఆయన మీద వార్నర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దొంగ ముండా కొడుకు.. వీడు.. రేయ్ వార్నర్.. లాంటి మాటలు రాజేంద్ర ప్రసాద్ స్థాయి వ్యక్తి సరదాగా కూడా వాడాల్సిన మాటలు కాదని.. ఈ విషయంలో ఆయనతో పాటు చిత్ర బృందం వార్నర్‌కు సారీ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News