పాన్‌ ఇండియా సినిమాల రిలీజ్ కష్టాలు!

పాన్‌ ఇండియా సినిమాల విడుదల తేదీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక భాషలో పోటీ తప్పడం లేదు.;

Update: 2025-03-31 10:30 GMT
పాన్‌ ఇండియా సినిమాల రిలీజ్ కష్టాలు!

ఒకే భాషలో సినిమాను విడుదల చేస్తే పోటీ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. పెద్ద సినిమాలు, క్రేజ్ ఉన్న సినిమాల మేకర్స్‌ ఇండస్ట్రీలో లోకల్‌గా చర్చించి సోలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తారు. కానీ భారీ పాన్‌ ఇండియా సినిమాలకు అన్ని భాషల్లో సోలో రిలీజ్‌ లభించడం కష్టంగా ఉంది. ఉదాహరణకు టాలీవుడ్‌ స్టార్‌ హీరో పాన్ ఇండియా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సోలో రిలీజ్‌ దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఇతర భాషల్లో సోలో రిలీజ్ కావాలంటే కష్టమే. కనుక ఇతర భాషల సినిమాలతో పోటీగానే పాన్‌ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ పోటీలో కొన్ని సినిమాలు నిరాశను మిగిల్చితే కొన్ని సినిమాలు హిట్ టాక్‌తో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల సక్సెస్‌ సొంతం చేసుకుంటున్నాయి.

పాన్‌ ఇండియా సినిమాల విడుదల తేదీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక భాషలో పోటీ తప్పడం లేదు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ' సినిమా విడుదల తేదీ విషయంలో కన్ఫ్యూజన్‌ నెలకొంది. ఆగస్టులో సినిమాను విడుదల చేసేందుకు గాను నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలోనే హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న 'వార్‌ 2' సినిమా విడుదల కాబోతుంది. ఆగస్టు 14న వార్‌ 2 విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. వార్‌ 2 షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. కనుక ఆగస్టులో విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

'వార్‌ 2' సినిమా ఆగస్టులో విడుదలైతే 'కూలీ' సినిమా విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఒకవేళ వార్‌ 2 సినిమా ఆగస్టు నుంచి తప్పుకుంటే ఆ తేదీకి రావాలని భావిస్తున్నారు. ఒక వైపు రజనీకాంత్‌ కూలీ సినిమా మేకర్స్ విడుదల విషయంలో సందిగ్దంలో ఉంటే మరో వైపు సూపర్‌ స్టార్ శివరాజ్ కుమార్‌, ఉపేంద్ర నటిస్తున్న '45' సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం కన్నడంలో మాత్రమే కాకుండా హిందీ, తెలుగు, తమిళ్‌, మలయాళంలోనూ సినిమాను రిలీజ్ చేసేందుకు గాను రెడీ అయ్యారు. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. అంచనాలు భారీగా ఉన్న 45 సినిమా వస్తే కూలీ సినిమాకు పోటీ తప్పదు.

బాలీవుడ్‌ మూవీ వార్ 2 ఉన్నప్పటికీ ఆగస్టులోనే అది కూడా 15వ తారీకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగానే వార్‌ 2 సినిమా విడుదల వాయిదాను 45 మేకర్స్ ఊహించారా లేదంటే కంటెంట్‌ పై నమ్మకంతో పోటీకి సిద్ధం అయ్యారా అనేది తెలియాల్సి ఉంది. కూలీ సినిమా సేఫ్‌ టైమ్‌లో విడుదల చేయాలని, పోటీ లేని సమయంలో విడుదల చేయాలని భావించి డేట్‌ ప్రకటించక పోవడంతో రంగంలోకి 45 దిగింది. ఇప్పుడు వార్ 2 విడుదల కాకున్నా కూడా '45' సినిమాతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముందుగా డేట్‌ను ప్రకటించక పోవడం అనేది తప్పుడు నిర్ణయం అంటూ కొందరు రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో కూలీ సినిమాకు క్రేజ్ ఉంది. మరి ఆ క్రేజ్‌కి తగ్గట్లుగా మంచి టైంకి సినిమాను విడుదల చేయగలుగుతారా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News