ముత్తువేల్‌గా సూపర్ స్టార్ రీ ఎంట్రీ కన్ఫర్మ్
సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద జైలర్ సినిమాతో భారీ వసూళ్లు సొంతం చేసుకున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద జైలర్ సినిమాతో భారీ వసూళ్లు సొంతం చేసుకున్నారు. ఆయన స్థాయికి తగ్గ విజయాన్ని జైలర్ సినిమాతో అందుకున్నారు. అందుకు జైలర్ సినిమా రజనీకాంత్‌కి అత్యంత స్పెషల్‌గా నిలిచింది అనడంలో సందేహం లేదు. అందుకే ఆ సినిమాకు సీక్వెల్‌ను తీయాలి అనే ఉద్దేశ్యంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ చెప్పిన వెంటనే రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన వయసుకు తగ్గ పాత్ర కావడంతో పాటు మంచి పవర్ ఫుల్ స్టోరీ లైన్‌ను తీసుకోవడం వల్ల మంచి విజయాన్ని జైలర్ అందుకుంది. మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కారణంగా సినిమా హిట్ అయ్యింది.
కొన్ని నెలల క్రితమే దర్శకుడు నెల్సన్ దిలీప్ తాను జైలర్ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. అందుకు సంబంధించిన స్టోరీ లైన్‌కు రజనీకాంత్ సర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నెల్సన్ చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే సినిమాను భారీ ఎత్తున సీక్వెల్ చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేశాడు. రికార్డ్ స్థాయి బడ్జెట్‌తో సినిమాను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మరోసారి జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అంటూ దర్శకుడు నెల్సన్ దిలీప్ చాలా నమ్మకంగా చెబుతున్నాడు. పొంగల్ సందర్భంగా సినిమా అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌కి సిద్ధం అయ్యింది.
జైలర్ 2 సినిమా అధికారిక ప్రకటన కోసం నెల్సన్ దిలీప్ రెండు వీడియోలను రెడీ చేశాడట. వాటికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయించాడు. అందులో ఒక వీడియోను 4 నిమిషాల 30 సెకన్లు నిడివితో రూపొందించగా మరో వీడియోను 2 నిమిషాల 23 సెకన్ల నిడివితో రూపొందించడం జరిగింది. ఈ రెండు వీడియోల్లో మొదట ఏ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు అనేది చూడాలి. రేపు సినిమా రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్‌తో పాటు ఇతర విషయాల గురించి మరింత స్పష్టంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
రజనీకాంత్ జైలర్ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వీరి కాంబోలో మళ్లీ సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు జైలర్ కి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నిమిషాల వీడియోలో సినిమా కథను పూర్తిగా రివీల్ చేస్తారనే ఊహాగాణాలు వస్తున్నాయి. మరి దర్శకుడు నెల్సన్ దిలీప్ ఏం ప్లాన్ చేశారు అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.