బ్యాటరీ కంటైనర్ బ్లాస్ట్: రజనీ అండ్ టీమ్‌కి తప్పిన ప్రమాదం
ఘటన జరిగిన సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూలీ షూటింగ్ సమీపంలోనే జరుగుతోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలీ షూటింగులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు ఉన్న కూలీ సినిమా సెట్‌కు సమీపంలోని కంటైనర్ టెర్మినల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. చైనా నుంచి కోల్‌కతాకు షిప్‌మెంట్ కోసం లోడ్ అవుతున్న కంటైనర్ నుంచి మంటలు చెలరేగాయి. బీచ్ రోడ్ కి ఇది సమీపంలో ఉంది. కంటెయినర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో టెర్మినల్ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూలీ షూటింగ్ సమీపంలోనే జరుగుతోంది.
ఈ సినిమా గత పది రోజులుగా విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్‌లో అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న `కూలీ` చిత్రబృందం వెంటనే భద్రతా చర్యలు చేపట్టి, రజనీకాంత్‌తో పాటు మిగిలిన టీమ్‌ను సెట్ నుండి సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. ఈ ఘటనపై చిత్ర యూనిట్ ఆందోళన చెందుతున్నప్పటికీ అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసింది.
ఆగస్టు 28న చైనా నుంచి వచ్చిన కంటైనర్‌లో లిథియం బ్యాటరీలు తీసుకుని కోల్‌కతాకు వెళ్తున్నారు. ప్రాథమిక హెచ్చరిక ఉన్నప్పటికీ ఏదో ఒక పొరపాటు జరిగింది. అయితే ఈ బ్లాస్ట్ వల్ల పరిసరాల్లో ఉన్న కూలీ సెట్లకు పెద్దగా నష్టం జరగలేదు. ఎటువంటి ప్రాణనష్టం లేకుండా మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రస్తుతం అధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు. రజనీతో పాటు, శృతిహాసన్, అక్కినేని నాగార్జునలు నటిస్తున్న కూలీ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2024-25 సీజన్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో కూలీ ఒకటి. ఇది బహుభాషల్లో విడుదల కానుంది.