ర‌జ‌నీకాంత్ నిరాశ ప‌రిచార‌న్న‌ భార్య ల‌త‌

ల‌క్ష‌లాది మంది రజనీకాంత్ అభిమానుల్లానే ఆయన భార్య లత కూడా నిరాశ చెందారు.

Update: 2023-12-27 18:30 GMT

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయారంగేట్రంపై దేశ‌వ్యాప్తంగా చాలా చ‌ర్చ జ‌రిగింది. ఆయ‌న పార్టీ పేరు ప్ర‌క‌టించి కూడా రాజ‌కీయాల్లోకి రాకపోవ‌డం నిరాశ‌ప‌రిచింది. ల‌క్ష‌లాది మంది రజనీకాంత్ అభిమానుల్లానే ఆయన భార్య లత కూడా నిరాశ చెందారు. తన భర్త రాజకీయాల్లోకి రావాలని తాను కోరుకున్నానని, అతను తన పార్టీని ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నప్పుడు నిరాశ చెందానని లత తాజా ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో రజనీకాంత్ అసాధార‌ణ‌ శక్తిగా ఉండేవారు. అయితే రజనీ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి నిజమైన కారణం ఉందని ఆమె అంగీకరించారు.

కొచ్చాడైయాన్ సినిమా హక్కుల వివాదంపై కోర్టుకు హాజరైన లత మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ర‌జ‌నీ రాజ‌కీయాల‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కేసులో బెయిల్ పొందిన అనంతరం లత మీడియాతో మాట్లాడుతూ.. తాను నిర్దోషినని, ఈ కేసు అవమానకరమని, దూషణే లక్ష్యంగా ఉందని అన్నారు.

ర‌జ‌నీ రాజ‌కీయాల‌పై ల‌త స్ప‌ష్ఠంగా మాట్లాడారు. 2017 డిసెంబ‌ర్‌లో వేలాది మంది అభిమానుల సమక్షంలో రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీకాంత్ ప్రకటించారు. ఈ ప్రకటన తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో రజినీ `మక్కల్‌ మండ్రం` పోటీ చేస్తుంద‌ని చెప్పారు. అయితే 2021 లో యు-టర్న్ తీసుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆరోగ్య సమస్యల కారణంగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించనని పేర్కొన్నాడు. దశాబ్దాలుగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పెద్ద షాకిచ్చింది. రజనీకాంత్ తన రాజకీయ ఆకాంక్షలను తన సినిమాలు పాటల ద్వారా చాలా కాలంగా సూచిస్తూ వస్తున్నారు. సంవత్సరాలుగా ఎదురు చూసిన‌ తన అభిమానులకు ఆశను కల్పించాడు. కానీ 2021లో అదంతా ముగిసింది.

అప్పటి నుంచి ర‌జ‌నీ పూర్తిగా తన సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన అతని చివరి వెంచర్ జైలర్ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లు వసూలు చేసింది. త‌దుప‌రి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న వేట్టైయన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వెట్టైయన్ తర్వాత తలైవర్ 171 కోసం లోకేష్ కనగరాజ్‌తో క‌లిసి ప‌ని చేస్తారు.

Tags:    

Similar News