సత్యకి పోటీ వచ్చాడా?
అయితే టాలీవుడ్ లో ఇప్పుడు సత్యని బీట్ చేస్తూ కమెడియన్ గా దూసుకొస్తున్న నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి.
టాలీవుడ్ ప్రేక్షకులు ఎన్ని కమర్శియల్ సినిమాలు వచ్చిన కూడా ప్రతి మూవీలో కచ్చితంగా వినోదాన్ని కోరుకుంటారు. దర్శకులు కూడా సినిమాలో అంతర్లీనంగా కామెడీ ఎలిమెంట్స్ జోడించి కథలు చెప్పే ప్రయత్నం చేస్తారు. కథకి సంబంధం లేకుండా కొంతమంది కామెడీ ట్రాక్ లు క్రియేట్ చేసి ఫన్ జెనరేట్ చేస్తారు. దీనిని బట్టి కామెడీకి తెలుగు ప్రేక్షకులు ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఏ ఇండస్ట్రీలో లేనంత మంది కమెడియన్స్ టాలీవుడ్ లో ఉన్నారు.
అయితే వారిలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది కనిపిస్తారు. అలా గత కొన్నేళ్ళ నుంచి స్టార్ కమెడియన్ గా టాలీవుడ్ లో భాగా వినిపిస్తోన్న పేరు సత్య. హీరో ఫ్రెండ్ పాత్రలలో లేదంటే ప్రత్యేకమైన క్యారెక్టర్స్ లలో సత్య కామెడీ పండిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సత్య సినిమాలో ఉంటే హిట్ గ్యారెంటీ అనే అభిప్రాయం దర్శక, నిర్మాతలలో కూడా ఉంది. అతను కూడా తనకిచ్చిన క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేస్తున్నాడు.
సత్య కంటే ముందు వెన్నెల కిషోర్ లీడింగ్ కమెడియన్ గా ఉన్నారు. అయితే వెన్నెల కిషోర్ ఎక్కువగా స్టార్ హీరోల చిత్రాలలోనే కనిపిస్తున్నాడు. అయితే టాలీవుడ్ లో ఇప్పుడు సత్యని బీట్ చేస్తూ కమెడియన్ గా దూసుకొస్తున్న నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి. రాజావారు రాణిగారు సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన రాజ్ కుమార్ కసిరెడ్డి గత ఏడాది బెదుర్లంక 2012 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజాగా రిలీజ్ అయిన ఆయ్ సినిమా అయితే రాజ్ కుమార్ కసిరెడ్డిని ఏకంగా స్టార్ కమెడియన్ గా మార్చేసింది. ఆయ్ మూవీలో రాజ్ కుమార్ క్యారెక్టర్ కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులు ఫుల్ గా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. అంతగా తన క్యారెక్టర్ తో రాజ్ కుమార్ ఆకట్టుకున్నాడు. దీంతో ఈ టాలెంటెడ్ కమెడియన్ కి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఆయ్ లాంటి సినిమాలు మరో రెండు, మూడు పడితే ప్రస్తుతం స్టార్ పొజిషన్ లో ఉన్న సత్యని బీట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.
టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్న కూడా పూర్తిస్థాయిలో 2 గంటల పాటు వినోదాన్ని పండించే టాలెంట్ ఉన్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. గతంలో బ్రహ్మానందం, బాబూమోహన్, అలీ, సునీల్ లాంటి స్టార్ కమెడియన్స్ ఫుల్ గా వినోదం పండించేవారు. తరువాత వెన్నెల కిషోర్, సత్యలాంటి వారు వచ్చారు. వీరి కోవలోకి రాజ్ కుమార్ వచ్చాడు. రాజ్ కుమార్ లాంటి టాలెంటెడ్ కమెడియన్స్ వీలైనంత ఎక్కువ మంది పరిచయం అయినపుడు కథలలో కూడా దర్శకులు ఎక్కువ వినోదాన్ని జోడించడానికి ప్రయత్నం చేస్తారనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.