ఆయ్.. ఇతని కామెడీ సూపరండీ!
ఈ సినిమాలో కమెడియన్ రాజ్ కుమార్ కసిరెడ్డి థియేటర్స్‌లో ప్రేక్షకులను ఫుల్‌గా నవ్విస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది.
నార్నె నితిన్ హీరోగా, బన్నీ వాస్ నిర్మాణంలో, అంజిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "ఆయ్". ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో గ్రామీణ నేపథ్యంలో నడిచే వినోదాన్ని ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మరలా ఆహ్లాదభరితమైన వినోదాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమాలో కమెడియన్ రాజ్ కుమార్ కసిరెడ్డి థియేటర్స్‌లో ప్రేక్షకులను ఫుల్‌గా నవ్విస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది.
టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్స్ అంటే బ్రహ్మానందం, బాబు మోహన్, అలీ వంటి వారు గుర్తుకు వస్తారు. సునీల్ రెండు దశాబ్దాల పాటు కమెడియన్‌గా టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోయాడు. ఆ తర్వాత ఈ జనరేషన్‌లో వెన్నెల కిషోర్, సత్య వంటి వారు స్టార్ కమెడియన్స్‌గా కొనసాగుతున్నారు. తెరపై వారు కనిపిస్తే కచ్చితంగా ఫన్ జనరేట్ అవుతుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ప్రేక్షకులు కూడా వారి కామెడీని ఆస్వాదిస్తున్నారు.
వీరు కాకుండా చాలామంది కామెడీ యాక్టర్స్ టాలీవుడ్‌లో కొనసాగుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో వారు వినోదాన్ని పండించలేకపోతున్నారు. వెన్నెల కిషోర్, సత్య తర్వాత మరలా వారి స్థాయిలో తెరపై నవ్వులు పండించే యాక్టర్‌గా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మొదటి చిత్రం "రాజావారు రాణిగారు" మూవీతో రాజ్ కుమార్ కసిరెడ్డి కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు.
ఆ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న రాజ్ కుమార్‌కు సెకండ్ ఛాన్స్ రావడానికి చాలా టైం పట్టింది. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన "అర్జున ఫల్గుణ" మూవీలో రాజ్ కుమార్ తరువాత నటించాడు. ఆ సినిమాలో కూడా తన కామెడీతో రాజ్ కుమార్ మెప్పించాడు. కానీ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. తర్వాత "బ్లడీ మేరీ", "చిత్తం మహారాణి", "సీతారామం", "రంగవల్లి" సినిమాలలో రాజ్ కుమార్ కసిరెడ్డి నటించాడు. అయితే ఈ సినిమాలు ఏవీ కూడా అతనికి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు.
గత ఏడాది కార్తికేయ హీరోగా వచ్చిన "బెదురులంక 2012" సినిమాలో ఫుల్ లెంత్ పాత్రలో కమెడియన్‌గా అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో రాజ్ కుమార్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా వచ్చిన "ఆయ్" సినిమాలో మరోసారి రాజ్ కుమార్ కసిరెడ్డి తన టాలెంట్ చూపించాడు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్‌గా ఫన్ జనరేట్ చేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు. సినిమాలో అతని పాత్ర కనిపించిన ప్రతిసారి కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారంటే ఏ రేంజ్‌లో మెప్పించాడో అర్థం చేసుకోవచ్చు. ఆయ్ సినిమా సక్సెస్‌లో కచ్చితంగా రాజ్ కుమార్ కామెడీ టైమింగ్‌కి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందనే మాట వినిపిస్తోంది. టాలీవుడ్‌కి మరో బెస్ట్ కమెడియన్‌గా రాజ్ కుమార్ దొరికినట్లే అనే టాక్ నడుస్తోంది. గోదావరి యాసలో కామెడీ అంటే సునీల్ పేరు వినిపించేది. ఇప్పుడు ఆ లోటుని రాజ్ కుమార్ కసిరెడ్డి భర్తీ చేస్తాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.