మౌనంతోనే మాట నెగ్గించుకున్న సంచలనం!
సంచలనాల రాంగోపాల్ వర్మతో సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సెట్స్ లో ఆయన చెప్పినట్లు చేయాల్సిందే.
సంచలనాల రాంగోపాల్ వర్మతో సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సెట్స్ లో ఆయన చెప్పినట్లు చేయాల్సిందే. ఎంత పెద్ద స్టార్ అయినా? ఆన్ సెట్స్ లో వర్మ మాట వేద వాక్కుతో సమానం. ఆయన మాటని దిక్కరించడానికి ఛాన్స్ లేదు. అయితే తొలిసారి వర్మకు బిగ్ బీ అమితాబచ్చన్ రూపంలో ఓ సవాల్ ఎదురైంది. ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `సర్కార్` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
అందులో ప్రతీ సీన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. వర్మ మేకింగ్... అమితాబ్ నటన ప్రతీది అద్భుతం. అందుకే ఆ సినిమా అంత పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ కూడా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. అయితే `సర్కార్` షూటింగ్ సమయంలో ఓసీన్ విషయంలో వర్మతో అమితాబ్ ఏకీభవించలేదు. `సర్కార్` లో అమితాబ్ తన కుమారుడిని బయటకు వెళ్లమనే సందర్భం ఉంటుంది. ఆ సన్నివేశంపైనే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి.
కోపంగా అరిచి చెప్పాలన్నది వర్మ అభిప్రాయం కాగా, అమితాబ్ సర్కార్ అలాంటితండ్రి కాదు మరోలా చేద్దామని వర్మకి సలహా ఇచ్చారు. దీంతో వర్మ ..అమితాబ్ తో వాదించడం ఇష్టం లేక మౌనం వహించారు. ఆ సీన్ మరుసటి రోజు రీ షూట్ చేద్దామని చెప్పి వచ్చేసారుట. ఆ రాత్రి 11 గంటలకు అమితాబ్ ఫోన్ చేసి తాను అనుకున్న దాని కంటే నువ్వు చెప్పిందే బాగుందని వర్మ దారిలోకి వచ్చారుట. ఆ మరుసటి రోజు సీన్ షూట్ చేసిన తర్వాత ఔట్ పుట్ చూసుకుంటే ఎంతో అద్భుతంగా వచ్చిందిట.
దర్శకుడికి-నటుడికి మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందనేదానికి అదో ఉదాహరణ. అవతలి వారి ఆలోచనలు మనకి నచ్చకపోతే కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిదన్నారు. అలా ఉండటం వల్ల కూడా పరిస్థితులు తమకు అనుకూలంగా మారితాయన్నది అప్పుడే అర్దమైందని వర్మ అన్నారు.