ఏపీలో ఆర్జీవీపై వరుస కేసులు... ఫిర్యాదులు ఏమిటంటే..?
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి, ఆయన వ్యాఖ్యలు, ఆయన చుట్టూ ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో నాయకుల ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, నేతల ఇళ్లల్లోని మహిళలపై సభ్య సమాజం సిగ్గుపడేలా కామెంట్లు చేయడం, మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం వంటి వ్యవహారాలపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడాలేవీ లేకుండా చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
దీంతో.. మరింత దూకుడు పెంచిన పోలీసులు పలువురుకి నోటీసులు జారీ చేస్తుండగా.. మరికొంతమందిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ తరుణంలో... గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లతో పాటు నారా లోకేష్, నారా బ్రాహ్మణి ల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ దర్శకుడు ఆర్జీవీపై పలు స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి.
అవును... దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి, ఆయన వ్యాఖ్యలు, ఆయన చుట్టూ ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఆయన చేసిన చిత్రం "వ్యూహం" ప్రమోషన్స్ సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేశారని తాజాగా ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం... రామ్ గోపాల్ వర్మ పై ఫిర్యాదు చేశారు. దీంతో... పోలీసులు ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదు చేశారు.
మరోపక్క గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. గతంలో... చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ రైతు విభాగం ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అర్జీవీపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు!
కాగా... ఏపీ రాజకీయాలను ఆధారం చేసుకుని ఆర్జీవీ పొలిటికల్ డ్రామా "వ్యూహం" చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2023 డిసెంబర్ 29న విడుదల చేయాలని భావించినా.. దీనికి సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలను నిలిపివేయాలని కోరారు.
అనంతరం ఎన్నో సందిగ్ధతల మధ్య మార్చి 2024లో ఈ సినిమా విడుదలయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో చంద్రబాబు పై ఆర్జీవీ సోషల్ మీడియాలో భారీగా పోస్టులు పెట్టరు! ఈ క్రమంలో తాజాగా వర్మపై పలు కేసులు నమోదయ్యాయి!