ఇదే సౌండ్ నార్త్ ఇండియా మొత్తం వినిపించాలి: రామ్ చరణ్
ఈ టీజర్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఆయనతో కలిసి పని చేయడం, ఈ సినిమాలో భాగం అవ్వడం నా అదృష్టం'' అని రామ్ చరణ్ అన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గేమ్ ఛేంజర్''. శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భర్తీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆఫ్ లైన్ ప్రమోషన్స్ షురూ చేసారు. శనివారం లక్నోలో గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ డైరెక్టర్ శంకర్ తో వర్క్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు నార్త్ ఇండియా మొత్తం వినపడాలని పేర్కొన్నారు.
''గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ కోసం ఇక్కడి దాకా వచ్చిన మీడియా, ఫ్యాన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. ఇదే సౌండ్ నార్త్ ఇండియా మొత్తం బాగా వినిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. శంకర్ గారిని ఈరోజు చాలా మిస్ అవుతున్నాం. ఆయన చాలా బిజీగా ఉన్నారు. థాంక్యూ శంకర్ సార్. ఈ టీజర్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఆయనతో కలిసి పని చేయడం, ఈ సినిమాలో భాగం అవ్వడం నా అదృష్టం'' అని రామ్ చరణ్ అన్నారు. ''ఇండియాలో లక్నో చాలా పెద్ద సిటీ. ఇక్కడి ప్రజల మనసులు చాలా పెద్దవి. మా గత చిత్రాన్ని పెద్ద మనసుతో ఆదరించారు. ఇక్కడ టీజర్ లాంచ్ జరగడం చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు. అభిమానులను కలుసుకోవడానికి, మాట్లాడటానికి మరో వేదిక ఉందని చరణ్ తెలిపారు.
'గేమ్ ఛేంజర్' టీజర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ తో పాటుగా.. కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జే సూర్య, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. సినిమాలో తన పాత్ర విని వెంటనే ఓకే చేసానని, చాలా కొత్తగా ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించిందని నటి అంజలి తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కారణమని చెప్పింది. రామ్ చరణ్‌తో మరోసారి కలిసి పని చేయడం ఆనందంగా ఉందిని కియారా చెప్పుకొచ్చింది. టీజర్ లోని అన్ ప్రెడిక్టబుల్ డైలాగ్ చెప్పి అభిమానులను ఉత్సాహ పరిచింది. ఇది టీజర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని ఎస్.జె సూర్య అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. తమ బ్యానర్ లో ఇది 50వ చిత్రమని చెప్పారు. శంకర్ తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నానని, అది రామ్ చరణ్‌తో అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో డైరెక్టర్ శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఈ సందర్భంగా శంకర్ ట్వీట్ చేస్తూ.. ''2025 సంక్రాంతి నాటికి ఈ సినిమాని బిగ్ స్క్రీన్‌ల మీదకు తీసుకురావడానికి నేను ఇప్పటికీ చెన్నై ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాను. అందుకే ఈరోజు మిమ్మల్ని మిస్ అవుతున్నాను. త్వరలోనే నేను మిమ్మల్ని కలుస్తాను'' అని పేర్కొన్నారు.