అంబానీ పెళ్లిలో వింతవింతలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్నా పెద్దా అనే తేడా వ్యవహారం లేదు. ఖాన్ ల త్రయం చిన్న పిల్లలు అయిపోయారు. వేదికపై బోలెడంత ఫన్ పంచారు. అలాగే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఖాన్ లు ప్రవర్తించిన తీరు.. వారి ఒదిగి ఉండే స్వభావం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా మెగాస్టార్ వారసుడికి బాలీవుడ్ ఇలాఖాలో ఉన్న గౌరవం అభిమానం ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి చరణ్ చాలా కాలంగా సల్మాన్ ఖాన్ కి సన్నిహితుడు. నిరంతరం ముంబైలో భాయ్ ని కలవనిదే చరణ్ కి నిదుర పట్టదు. సల్మాన్ ఖాన్ అంటే అంతటి అభిమానం. చిరు అంటే సల్మాన్ భాయ్ కి కూడా వీరాభిమానం. ఈ సత్సంబంధాలు దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి. మరోవైపు కింగ్ ఖాన్ షారూఖ్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తోను చరణ్ కి గొప్ప సంబంధాలున్నాయని ఇప్పుడు మరోసారి అంబానీ ప్రీఈవెంట్ నిరూపించింది.
చరణ్ ని ఖాన్ లు వేదికపైకి పిలుస్తూ పేరు పెట్టి పిలవడం .. తనకోసం వేచి చూడటం విస్మయపరిచింది. స్టేజ్ పై ఉన్న ఖాన్ ల త్రయం చరణ్.. కహా తూ? (ఎక్కడున్నావ్).. త్వరగా ఇక్కడికి రా! అంటూ పిలిచారు. రామ్ రామ్ రామ్ అంటూ పదే పదే రామ్ చరణ్ ని పిలవడం అభిమానుల చెవులను తాకింది. అంత పెద్ద స్టార్లు చరణ్ ని ఎంత అభిమానంగా పిలిచారు? ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించేదే.
ఇక వేదిక ఆద్యంతం ఫన్ తో నింపేసిన ఖాన్ ల బృందం లో షారూఖ్ ఎంతో హుషారుగా కనిపించారు. చరణ్ వేదికపైకి వస్తుంటే పాదాలు తాకబోయిన షారూఖ్ లోని ఫన్ ఒదిగి ఉండే స్వభావం నవ్వించింది. చరణ్ కూడా షారూఖ్ పాదాలను తాకుతుంటే దానిని షారూఖ్ వారించారు. ఖాన్ లు ముగ్గురూ షారూఖ్.. అమీర్.. సల్మాన్ లకు చరణ్ పాద నమస్కారానికి ప్రయత్నిస్తుంటే వారంతా అతడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అంబానీల ప్రీవెడ్డింగ్ లో ఇది అరుదైన దృశ్యం.
ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటిన రామ్ చరణ్ కి హిందీ మీడియాలోను బోలెడంత ఫాలోయింగ్ ఏర్పడింది. హిందీ పరిశ్రమతో గొప్ప సత్సంబంధాలను చరణ్ కొనసాగిస్తున్నాడు. ఇది తదుపరి విడుదలకు రానున్న `గేమ్ ఛేంజర్`కి పెద్ద ప్లస్ కానుంది. చరణ్ తనను తాను దేశంలోనే అతి పెద్ద పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకోవడానికి ఈ సంబంధాలు సహకరిస్తాయనడంలో సందేహం లేదు.