ఆర్జీవీ 'గాడిద' పోస్ట్.. థ్యాంక్స్ చెప్పిన హరీశ్ శంకర్!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దర్శకులలో రామ్ గోపాల్ వర్మ, హరీశ్ శంకర్ ముందు వరుసలో ఉంటారు

Update: 2024-07-27 15:30 GMT

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దర్శకులలో రామ్ గోపాల్ వర్మ, హరీశ్ శంకర్ ముందు వరుసలో ఉంటారు. ఇద్దరూ తమ సినిమాల సంగతులను పెంచుకోవడమే కాకుండా, వివిధ అంశాలపై స్పందిస్తుంటారు. ఆర్జీవీ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పోస్టులు పెడితే.. హరీశ్ మాత్రం డైరెక్ట్ గా తన పోస్టులలో ఎటాక్ చేస్తుంటారు. అయితే తాజాగా వర్మ 'ఎక్స్'లో ఓ పోస్ట్ పెట్టడం, దాన్ని హరీష్ శంకర్ కోట్ చెయ్యడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

"ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం వల్ల గాడిద కూడా సింహం అనుకునేలా చేస్తుంది" అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు. దీన్ని హరీష్ శంకర్ రీపోస్ట్ చేస్తూ "గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సార్" అని పేర్కొన్నారు. ఆర్జీవీ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో, దాని వల్ల హరీశ్ కు ఏమి గుర్తుకు వచ్చిందో తెలియదు కానీ.. మొత్తానికి ఇద్దరూ ఎవరినో ఉద్దేశించే ఈ పోస్టులు పెట్టినట్లుగా సినీ అభిమానులు భావిస్తున్నారు. వాళ్ళు ఎవరై ఉంటారని ఆలోచిస్తున్నారు.

హరీష్ శంకర్ ప్రస్తుతం ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జూలై 28న టీజర్ ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత బిజీలో కూడా హరీశ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. తన సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాల గురించి ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన ఓ సినీ జర్నలిస్ట్ తో ట్వీట్ వార్ చేశారు.

‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాకు సంబంధించి నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ.12.60 కోట్లు నాన్‌ రిటర్నబుల్‌ అడ్వాన్స్‌ గా, రూ.2.40 కోట్ల రిటర్నబుల్‌ అడ్వాన్స్‌ గా మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నట్లు సదరు ఫిలిం జర్నలిస్ట్ పోస్ట్ పెట్టారు. దీనిపై డైరెక్టర్‌ హరీశ్ శంకర్ స్పందిస్తూ.. "మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నా. దయచేసి చెడగొట్టుకోకండి. ప్రస్తుతానికి ఇది రిక్వెస్ట్‌ మాత్రమే" అని బదులిచ్చారు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఒకరి పోస్టుకు ఒకరు రియాక్ట్ అవుతూ కొంతసేపు ఎక్స్ ను హీట్ ఎక్కించారు.

హరీశ్ పోస్టుకు ఆ విలేఖరి స్పందిస్తూ.. "ఇక్కడ నేను చేసిన తప్పు ఏమిటి? డిస్ట్రిబ్యూటర్ చెప్పింది వేయడమా? మీ ఇంటర్వూ నేనేమీ అడగలేదే. నేను తప్పు అంకె వేస్తే ఖండించండి. రిక్వెస్ట్ కాదు, వార్నింగ్ అయినా తప్పు చేస్తే భయపడాలి" అని కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు. దానికి కౌంటర్ గా "మీరు తప్పు చేశారు అని నేను అనుకొని ఉంటే రిక్వెస్ట్ అనే వాడిని కాదు. లావాదేవీలు ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఇద్దరితో కన్ఫార్మ్‌ చేసుకోవాలి. మీరు ఇంటర్వ్యూ అడిగారని నాకు ఓ వ్యక్తి చెప్పాడు. మీకు ఒక డిస్ట్రిబ్యూటర్‌ చెప్పినట్టు" అని రిప్లై ఇచ్చారు హరీశ్.

ఇందుకు జర్నలిస్ట్ బదులిస్తూ.. "నేను మీ ఇంటర్వూ కావాలని అడగలేదు. మరోసారి క్లారిటీగా చెబుతున్నా. మీ పీఆర్ ఫోన్ చేసి హరీష్ గారు మీకు ఫస్ట్ ఇంటర్వూ ఇస్తారట. కానీ ఆయన కెమేరా కూడా పెట్టుకుంటారట. మీకు ఓకెనా అని అడిగారు. దానికి నేను ఓకె..వన్ సెకెండ్ కూడా కట్ చేయకుండా అప్లోడ్ చేస్తాను అని చెప్పాను. కొన్నవారే ఇంతకు కొన్నాము అని చెప్పింది వేసాను. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్..మీ సినిమా విషయంలో మాత్రమే కాదు. న్యూస్ సేకరించడం అన్నది నా వృత్తి" అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యలో హరీశ్ శంకర్ మరో పోస్ట్ పెడుతూ.. “మీరు ఒకసారి ఇంటర్వ్యు ఇస్తా అని ఇవ్వలేదంట అన్నప్పుడు, సరే ఈసారి ఆయనతోనే మొదలెడదాం అన్నాను. ఇది నా వైపు నుండి క్లారిటీ. ఇకపోతే గతంలో 'భవదీయుడు భగత్ సింగ్' టైటిల్ లీక్ చేసిన మీరు ఇప్పుడు తప్పు ఒప్పు అంటూ డిస్కషన్ పెట్టకండి. మీకు సూట్ అవ్వదు. కేవలం మీ సోషల్ మీడియా పరపతి పెంచుకోడానికి డిటైల్స్ లీక్ చేసి, దాని తాలూకా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే అఫిషియల్ అప్డేట్ ఫన్ ను కిల్ చేసే మీలాంటి వాళ్లు తప్పొప్పులు మాట్లాడటం చూస్తే నవ్వొస్తోంది. నేను డైరెక్టర్ కాబట్టి ఇంకా మర్యాదగా మాట్లాడుతున్నా" అని అన్నారు.

హరీష్ శంకర్, సదరు విలేఖరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు ‘మిస్టర్‌ బచ్చన్‌’ నిర్మాత విశ్వప్రసాద్‌ స్పందిస్తూ.. "సినిమా బిజినెస్‌ వివరాలను గోప్యంగా ఉంచాలని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ భావిస్తోంది. మా ప్రైవేట్ సమాచారాన్ని బయటపెట్టొద్దని ఉత్సాహభరితమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులను కోరుతున్నాం" అని పేర్కొన్నారు. దీనిపై జర్నలిస్టు రియాక్ట్ అవుతూ "తప్పకుండా సార్. ఇకపై మీ అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుంటాను. మీరు మీ ట్వీట్ లో వాడిన భాష నాకు నచ్చింది. ఫోన్ చేసి ఎంతో మెచ్యూర్ గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు సర్" అని బదులిచ్చారు. అక్కడితో ఈ చర్చ ముగిసింది.

Tags:    

Similar News