ప్రేక్షకులను మెప్పించడం కోసం లాభాపేక్ష చూపించని రామోజీ..!
రామోజీ గ్రూప్స్ అధినేత మీడియా మొఘల్ రామోజీరావు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే
రామోజీ గ్రూప్స్ అధినేత మీడియా మొఘల్ రామోజీరావు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు ఆయన అందించిన సేవలు అన్నీ కావు. స్వతహాగా రాజకీయాల్లో లేకపోయినా ఈనాడు వార్తాపత్రిక, ఈ టీవీ ద్వారా కొన్ని దశాబ్దాలుగా ఆయన వీక్షకులను మెప్పిస్తూ వచ్చారు. ఇక సినీ పరిశ్రమ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాకు కేరాఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ అనిపించేలా ఫిల్మ్ సిటీ రూపకల్పన జరిగింది.
కేవలం తెలుగు సినిమాలే కాదు సౌత్ అన్ని సినిమాలతో పాటుగా బాలీవుడ్ సినిమాలు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకునేవి. ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేయడం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలను ఇంట్రడ్యూస్ చేశారు రామోజీ. అంతేకాదు కొన్ని కార్యక్రమాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేశారు.
సాధారణంగా ఏదైనా ప్రోగ్రాం చేస్తే దాని ఖర్చు ఎంత దాని వల్ల మనకు లాభం ఎంత అని ఆశిస్తారు. కానీ రామోజీ రావు కేవలం లాభం గురించి ఆలోచించకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే ఆలోచనతో చేసిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి.
ఈటీవీలో వచ్చిన మాల్గుడి కథలు కార్యక్రమం అప్పట్లో ప్రతి సండే వచ్చేది. ప్రేక్షకులకు మాల్గుడి కథలతో ఎంటర్టైన్ చేస్తూ వచ్చేలా ప్లాన్ చేశారు. ఐతే మొదట్లో బాగానే రన్ అయిన ఈ ప్రోగ్రాం తర్వాత తర్వాత అంతగా మెప్పు పొందలేదు. అయినా సరే ఆ కార్యక్రమం అనుకున్న ఎపిసోడ్స్ పూర్తి చేసి టెలికాస్ట్ చేశారు. ఆ షోకి కమర్షియల్ యాడ్స్ రాకపోయినా సరే నడిపించిన ఘనత రామోజీకే దక్కుతుంది. అదే దారిలో అమరావతి కథలు అంటూ శంకరమంచి సత్యం రాసిన బుక్ బేస్ చేసుకుని చిన అమరావతి కథలు కూడా ఆయన ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రసారం చేశారు.
ఇప్పుడు టాయ్ స్టోరీస్ అని హాలీవుడ్ సీరీస్ లు చూసే మన చిన్నారులకు అప్పట్లోనే పంచతంత్రం అనే షో ఇంట్రడ్యూస్ చేశారు రామోజీ. పరవస్తు చిన్నయసూరి రాసిన కథల ఆధారంగా తోలు బొమ్మలాట చాలా కాలం వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగించారు. ఐతే వీటికి పెద్దగా కమర్షియల్స్ రాకపోయినా ప్రేక్షకులను ముఖ్యంగా చిన్నారులను అలరించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని కొనసాగించారు.
బాపు రమణల ఆధ్వర్యంలో వచ్చిన భాగవతం కార్యక్రమం కూడా ఇతిహాసాల గురించి వీక్షకులకు తెలియచెప్పేలా చూశారు. దాదాపు భాగవతం 350 ఎపిసోడ్స్ తో ప్లాన్ చేయగా మధ్యలో దర్శకత్వం మారినా సరే అది పూర్తి చేశారు.
పంచతంత్రం తర్వాత చిన్నారుల కోసం రామోజీ ఈటీవీలో బాల భారతం అంటూ ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఐతే దీనికి ప్రేక్షకాదరణ లేకపోయినా సరే కొన్నాళ్లు కొనసాగించారు. ఇదే కాకుండా తెలుగు వెలుగు అనే మాస పత్రికను కూడా రామోజీ తీసుకొచ్చారు. మొదట్లో పత్రిక ఆదరణ పొందినా తర్వాత ఆదరణ కరువవ్వడంతో ప్రింటింగ్ ఆపేశారు. ఐతే రామోజీ కోరిక మేరకే ఆన్ లైన్ లో ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఛానెల్ నడిపించడానికి వ్యాపారానికి సంబంధించిన లెక్కలు ఎలా ఉన్నా ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ అందించే క్రమంలో నష్టాలు చూసినా అలా ముందుకు సాగడం మాత్రం రామోజీ వల్లే అయ్యిందని చెప్పొచ్చు.