ఆ హీరో నిర్మాతగా సెటిల్ అవుతాడా?
రానా దగ్గుబాటి హీరోగా సినిమా చేసి మూడేళ్లూ పూర్తయింది. 2022 జనవరిలో `విరాట పర్వం` రిలీజ్ అయింది.
రానా దగ్గుబాటి హీరోగా సినిమా చేసి మూడేళ్లూ పూర్తయింది. 2022 జనవరిలో `విరాట పర్వం` రిలీజ్ అయింది. ఆ తర్వాత రానా నుంచి సోలో చిత్రం రిలీజ్ అయింది లేదు. నిఖిల్ హీరోగా నటించిన `స్పై` చిత్రంలో గెస్ట్ రోల్ పోషించాడు. అటుపై సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `వెట్టేయాన్` లో విలన్ రోల్ చేసాడు. ఆ తర్వాత మళ్లీ విలన్ పాత్ర లేదు..గెస్ట్ రోలు చేయలేదు. దీంతో రానా నటుడిగా, హీరోగా అభిమానులకు దూరమవుతున్నట్లే కనిపిస్తుందనే విమర్శ తెరపైకి వస్తోంది.
ఈ రకమైన గ్యాప్ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం లేకపోలేదు. భారీ చిత్రాల్లో హీరోగా నటించాలని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. మరి ఈ గ్యాప్ లో రానా ఏం చేస్తున్నాడు? అంటే నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. `కెరాఫ్ కంచరపాలెం` సినిమాతో రానా నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను తానే స్వయంగా నిర్మించాడు. అటుపై `కృష్ణా అండ్ హిజ్ లీల`, `777 చార్లీ` కి సమర్పకుడిగా వ్యవహరించారు.
`విరాట పర్వం` చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించారు. అటుపై `గార్గీ`,` పరేషాన్`, ` కీడా కోలా`, `35`, `జిగ్రా` చిత్రాలకు సమర్పకుడిగా వ్యవరహించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రం `కాంత`ని దుల్కర్ తో కలిసి రానా నిర్మిస్తున్నారు. ఇవిగాక కొన్ని కొత్త కథలు విని నిర్మించడానికి రెడీగా ఉన్నట్లు వినిపిస్తుంది. అలాగే కొన్ని టీవీ షోలను హోస్ట్ చేయడం సహా వాటి నిర్మాణంలోనూ భాగమవుతున్నారు.
మరి హీరోగా ఏవైనా సినిమాలు కమిట్ అయ్యారా? అంటే ఒక్క సినిమా కూడా కనిపించలేదు. రానా ఇలా వరుసగా సినిమాలు నిర్మిస్తుండటం చూస్తుంటే? ఆయన నిర్మాతగా సెటిల్ అవుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు నిర్మాణ రంగంలో ఉన్నారు. కానీ వాళ్లంతా అనధికారికంగా ఉన్నారు. హీరోగా బిజీగా ఉంటూనే నిర్మాణ రంగంలోనూ లాభాలు ఆర్జిస్తున్నారు. రానా మాత్రం వన్ వేలోనే కనిపిస్తున్నారు. మరి కొత్త ఏడాదిలోనైనా హీరోగా సినిమా ప్రకటిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.