రన్బీర్ × ప్రభాస్.. అసలు ఈ గోడవేంటి బాబు?

ఇప్పటికే సలార్ ఓటీటీలోకి రాగా.. కానీ యానిమల్ మాత్రం ఇంకా రాలేదు.

Update: 2024-01-25 07:54 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌లార్ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతోంది. నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వ్యూస్‌ ను ద‌క్కించుకుంటోంది. నెట్‌ ఫ్లిక్స్‌ టాప్‌-10 గ్లోబల్‌ చార్ట్స్‌ (నాన్‌ ఇంగ్లీష్ కేటగిరీ)లో మూడో స్థానంలో నిలిచింది. జనవరి 15-21 మధ్య అరుదైన ఫీట్ అందుకుందీ మూవీ. ప్రభాస్‌ కు వరల్డ్‌ వైడ్‌ గా ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు.

త‌క్కువ టైమ్‌ లోనే హైయ్యెస్ట్ వ్యూస్ ద‌క్కించుకున్న మూవీగా స‌లార్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే స‌లార్ ఓటీటీలోకి రావ‌డంతో వ్యూస్ భారీ స్థాయిలో వ‌చ్చిన‌ట్లు సినీ పండితులు చెబుతున్నారు. స‌లార్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ ఫ్లిక్స్ దాదాపు 100 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే సలార్ మూవీ కన్నా మూడు వారాల ముందే బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే సలార్ ఓటీటీలోకి రాగా.. కానీ యానిమల్ మాత్రం ఇంకా రాలేదు.

దీంతో ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ యానిమల్ టీమ్ ను టీజ్ చేసేలా రెండు రోజుల క్రితం సలార్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. దీనికి స్పందిస్తూ.. యానిమల్ టీమ్ తమ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా వెల్లడించింది. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తామంటూ నేరుగా కాకుండా పరోక్షంగా చెప్పింది.

నిజానికి సలార్ కూడా రిపబ్లిక్ డే నాడే ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. కానీ ఆరు రోజుల ముందుగానే అందరికీ సర్‌ ప్రైజ్ ఇస్తూ జనవరి 20నే నెట్‌ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. సలార్ తెలుగు, తమిళ వెర్షన్లు ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. కన్నడ వెర్షన్ 8, మలయాళ వెర్షన్ 10వ స్థానాల్లో ఉన్నాయి.

ఇప్పుడు యానిమల్ కూడా రిపబ్లిక్ డే నాడు ఓటీటీలోకి రావడంతో సలార్ కు గట్టి పోటీ ఉండనుంది. యానిమల్ వ్యూస్ ఎఫెక్ట్ సలార్ పై పడుతుందని సినీ పండితులు చెబుతున్నారు. మరి సలార్ కు భారీ వ్యూస్ దక్కుతున్న నేపథ్యంలో.. యానిమల్ కు ఓటీటీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.


Tags:    

Similar News