స్టార్‌ దర్శకుడి పేపర్ కప్‌ వివాదం...!

ఆయన సినిమాలను సమర్థించే వారు చాలా మందే ఉంటారు, అయితే ఆయన సినిమాలను వ్యతిరేకించే వారు కూడా కొందరు ఉంటారు.

Update: 2024-08-15 08:10 GMT

తమిళ దర్శకుడు పా రంజిత్ విభిన్నమైన సినిమా లతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. కుల వివక్ష ను ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా పా రంజిత్ సినిమాలు ఉంటాయి, ఆయన సమాజంలో ఉన్న వివక్ష ను తన సినిమాల్లో చూపించడం ద్వారా అర్థవంతమైన చర్చ జరిగేలా చేస్తున్నాడు అంటూ ఎంతో మంది ఆయన సినిమాలను మరియు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తూ ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు. ఆయన సినిమాలను సమర్థించే వారు చాలా మందే ఉంటారు, అయితే ఆయన సినిమాలను వ్యతిరేకించే వారు కూడా కొందరు ఉంటారు.

అట్టకత్తి సినిమా మొదలుకుని ఎన్నో సినిమాల్లో సున్నితమైన అంశాలను చూపిస్తూ, సమాజంలో ఉన్న వివక్షను తొలగించే ప్రయత్నాలు తనవంతు చేస్తున్న పా రంజిత్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాల కంటే కూడా ఎక్కువగా అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యల కారణంగా, సోషల్‌ మీడియా పోస్ట్‌ ల కారణంగా వార్తల్లో ఉంటాడు. తాజాగా మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచాడు. దళితుల పక్షాన నిలిచే దర్శకుడు పా రంజిత్‌ టి స్టాల్‌ లో వాడే పేపర్‌ కప్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఆ వీడియోలను షేర్ చేస్తూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల ఆయన ఒక విషయమై చేసిన వ్యాఖ్యల గురించి ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే టీ షాప్స్ లో పేపర్ గ్లాస్ లు వాడటం కూడా ఆధునిక యుగంలో అంటరానితనం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. పా రంజిత్‌ చేసిన వ్యాఖ్యలను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. టీ షాప్స్ లో కేవలం ప్లాస్టిక్ ను బ్యాన్‌ చేయడంతో పాటు, ఆరోగ్యపరమైన కారణాల వల్లే పేపర్ ను వినియోగిస్తున్నారు. అంతే తప్ప ఇందులో అంటరానితనం ఏంటో అర్థం కావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పా రంజిత్ ఏ ఉద్దేశ్యంతో ఆయన అన్నాడో తెలియడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

టీ షాప్స్ లో పేపర్‌ కప్స్‌ అనేవి అంటరానితనం కోణంలోకి వస్తాయనే అభిప్రాయం ను పా రంజిత్ తో పాటు కొందరు వ్యక్తం చేస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండేళ్లు కష్టపడి ఆయన తీసిన ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది. మరి సినిమాకు ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది చూడాలి. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కనుక ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News