బాలీవుడ్ 'థమా'లో పుష్ప 'గర్ల్‌ఫ్రెండ్' జాయిన్
పుష్ప 2 లో రష్మిక మందన్న నటనకు జాతీయ అవార్డు రావాల్సిందే అంటూ ఆమె అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న త్వరలో గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప 2 లో రష్మిక మందన్న నటనకు జాతీయ అవార్డు రావాల్సిందే అంటూ ఆమె అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అల్లు అర్జున్‌కి ఏమాత్రం తగ్గకుండా మంచి నటనతో మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గత ఏడాది డిసెంబర్‌లో వచ్చిన యానిమల్ సినిమా తర్వాత రష్మిక బాలీవుడ్‌లో బిజీ అవుతోంది. ఇప్పటికే విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. డిసెంబర్‌లోనే ఛావా సినిమా రావాల్సి ఉన్నా పుష్ప 2 విడుదల ఉండటంతో పాటు వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి కానందున వాయిదా వేసిన విషయం తెల్సిందే. త్వరలోనే ఆ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఛావా సినిమాతో పాటు తాజాగా మరో పెద్ద హిందీ సినిమాలో రష్మిక మందన్న నటిస్తోంది.
ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందుతున్న హర్రర్ కామెడీ మూవీ థమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఆయుష్మాన్ ఖురానా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు రష్మిక షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ఈమధ్య కాలంలో హర్రర్ కామెడీ సినిమాలకు మంచి స్పందన లభిస్తోంది. భూల్ భులయ్యాతో పాటు స్త్రీ 2 సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2 సినిమాకి రష్మిక మందన్న ఏకంగా రూ.10 కోట్ల పారితోషికంను అందుకుంది అనే విషయం తెల్సిందే. మూడు సంవత్సరాల పాటు పుష్ప కోసం కష్ట పడినట్లు చెప్పుకొచ్చింది. పుష్ప 2 విజయంతో భారీ ఎత్తున తన పారితోషికంను రష్మిక పెంచిందనే వార్తలు వస్తున్నాయి. అయినా ఆమెతో సినిమాలకు ప్రముఖ హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఆమె సినిమాల ఎంపిక ఉంటుంది. భారీ ఎత్తున అంచనాలున్న గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు వచ్చే ఏడాదిలో రష్మిక నటించిన మరో రెండు మూడు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో రష్మిక జోరు ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.