సూపర్‌స్టార్ బాడీగార్డ్ అంత స్పెషలా?
ఒకసారి షారుఖ్ ఖాన్ వ్యక్తిగత బాడీగార్డ్ రవి సింగ్ గురించి తెలుసుకుని తీరాలి.;

గ్యాంగ్ స్టర్ల బెదిరింపులతో బాలీవుడ్ గజగజ ఒణుకుతోంది. సూపర్‌స్టార్లను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇంతకుముందు కొందరు కమెడియన్లు, నటులను సినీపక్కీలో కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన దుండగులు ఉన్నారు. కారణం ఏదైనా హిందీ చిత్రసీమ భయానక పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇలాంటి సమయంలో స్టార్లకు భద్రత ఎలా? నమ్మకమైన సెక్యూరిటీ వారితో పని చేయడం వీలుపడుతుందా? అంటే.. ఒకసారి షారుఖ్ ఖాన్ వ్యక్తిగత బాడీగార్డ్ రవి సింగ్ గురించి తెలుసుకుని తీరాలి. దశాబ్ద కాలంగా సూపర్ స్టార్ షారూఖ్ జీవితంలో స్థిరమైన ఉనికిని కలిగి ఉన్న గార్డ్ అతడు. ఖాన్ భద్రతను సౌఖ్యాన్ని చూసుకోవడంలో అతడు తన పాత్రకు మించి కుటుంబ విధేయతతో ఖాన్ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయి పని చేస్తున్నాడు.
రవి సింగ్ అంకితభావం షారుఖ్ ఖాన్ నుండి అపారమైన నమ్మకాన్ని సంపాదించిపెట్టింది. కేవలం ఖాన్ భద్రతకు మాత్రమే కాకుండా అతడి భార్య గౌరీ ఖాన్, పిల్లలు - ఆర్యన్, సుహానా, అబ్రామ్ లకు కూడా అతడు బాధ్యత వహిస్తాడు. 2021లో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాక, చట్టపరమైన సవాళ్ల సమయంలో సింగ్ ఖాన్ కి ఎంతో బలం అయ్యాడు. అతడు స్వయంగా షారుఖ్, అతడి మేనేజర్ పూజా దద్లానీని కోర్టు విచారణలకు తీసుకెళ్లేవాడు. ఆర్యన్ ఆర్థర్ రోడ్ జైలు నుండి విడుదలైన తర్వాత తనతో పాటు రవిసింగ్ ఉన్నాడు. ఇది క్లిష్ట సమయాల్లో కుటుంబం షెరాపై ఎలా ఆధారపడుతుందో అర్థం చేసుకునేలా చేసింది. రవి సింగ్ పదేళ్లకు పైగా షారుఖ్ ఖాన్ కి సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. పలు జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు ఖాన్‌తో పాటు వెళ్ళాడు. విమానాశ్రయాలు, సినిమా సెట్‌లు, బహిరంగ ప్రదర్శనలలో ఖాన్‌తో కలిసి కనిపిస్తాడు.
షారుఖ్ ఖాన్ అంగరక్షకుడు రవి సింగ్ ఎంత సంపాదిస్తాడు? అని ప్రశ్నిస్తే... అతడు సముచితమైన మొత్తాన్ని అందుకుంటున్నాడు. రవి సింగ్ బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పొందే అంగరక్షకులలో ఒకడు. వార్షిక జీతం రూ.2.7 కోట్లు. పారితోషికాన్ని మించి అతడంటే ఒక నమ్మకం. ఖాన్ కుటుంబం అతనిపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని నిలబెట్టడంలో అతడి పాత్ర ఎంతో గొప్పది.
రవి సింగ్ ఎంత భారీ పారితోషికం అందుకుంటున్నా.. లో ప్రొఫైల్‌ను కొనసాగిస్తాడు. తన విధులు, ఖాన్ కుటుంబం భద్రతపై మాత్రమే దృష్టి పెడతాడు. ప్రపంచంలోని అతిపెద్ద సూపర్‌స్టార్‌లలో ఒకరితో అనుబంధం కలిగి ఉన్న రవి సింగ్ చెప్పుకోదగ్గ వివేకవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతడు యూనిఫాం ధరిస్తాడు. సాధారణ నలుపు లేదా నేవీ టీ-షర్టులు, డెనిమ్‌లు, సన్ గ్లాసెస్ తో కనిపిస్తాడు. అతడు ఇయర్‌పీస్ లేకుండా చాలా అరుదుగా కనిపిస్తాడు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు.
అతడిపై వివాదాలు ఉన్నాయి. 2014లో రవి సింగ్ ఒక కార్యక్రమంలో జనాన్ని మేనేజ్ చేస్తూ ఒక నటిని నెట్టివేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని వివాదంలో చిక్కుకున్నాడు. అతడిని బాంద్రా కుర్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ హెచ్చరికతో విడుదల చేశారు. 2022లో సింగ్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు సరైన డిక్లరేషన్ లేకుండా రూ.17.86 లక్షల విలువైన లగ్జరీ వాచీలను తీసుకెళ్లినందుకు జరిమానా చెల్లించాడు. షారుఖ్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని, అది చాలా పెద్ద కేసు అని వార్తలు వచ్చినా ఈ వార్తలపై సరైన స్పష్ఠత లేదు. తర్వాత రవి రూ. 6.88 లక్షల కస్టమ్స్ సుంకాన్ని చెల్లించాడు. ఈ ఘటనలు ఎలా ఉన్నా.. సింగ్ వృత్తి నైపుణ్యం, అంకితభావం ఎంతో గొప్పవి.