RC16: జగ్గూ భాయ్ గెటప్ చూశారా?

తాజాగా ఆయన తన మేకోవ‌ర్ కు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Update: 2025-01-16 06:53 GMT

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. పాపులర్ యాక్టర్స్ తో హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన తన మేకోవ‌ర్ కు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

''చాలా కాలం తర్వాత బుచ్చిబాబు #RC16 కోసం మంచి పని చేసాడు. గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా ఉంది'' అని జ‌గ‌ప‌తి బాబు ట్విట్టర్ 'ఎక్స్' లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా త‌న పాత్ర కోసం మేక‌ప్ వేసుకుంటున్న వీడియోను షేర్ చేసారు. వీడియో మధ్యలో 'RC16' కోసం సిద్ధమవుతున్నాను' అంటూ జగ్గూ భాయ్ లుక్ ని కూడా రివీల్ చేసారు. ఇందులో డైరెక్టర్ బుచ్చిబాబుని కూడా మనం చూడొచ్చు. రామ్ చరణ్ సినిమాలో త‌న పాత్ర మేకోవ‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని గతంలో ఓ సందర్భంలో జ‌గ‌ప‌తి బాబు చెప్పారు. ఆయన గెటప్, లుక్ స్టైలిష్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇంతకముందు 'రంగస్థలం' సినిమాలో చరణ్, జగపతిబాబు స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.

'ఆర్‌సీ 16' సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుంది. కన్నడ స్టార్ యాక్టర్ శివ‌రాజ్‌ కుమార్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న రోల్ చాలా ప‌వ‌ర్‌ ఫుల్ గా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మీర్జాపూర్‌ వెబ్ సిరీస్ లో మున్నాభాయ్ పాత్ర‌లో ఆకట్టుకున్న బాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ దివ్యేందు కీల‌క పాత్ర‌లో అల‌రించ‌బోతున్నాడు. మెలి తిప్పిన మీసం, ర‌గ్డ్ లుక్‌తో రిలీజ్ చేసిన దివ్యేందు ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాబోయే రోజుల్లో మిగతా పాత్రలకు సంబంధించిన క్యారక్టర్ పోస్టర్లు విడుదల కానున్నాయి.

'ఉప్పెన' సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బుచ్చిబాబు సానా.. ఇప్పుడు రామ్ చరణ్ తో ఉత్తరాంధ్ర రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ద‌ర్శ‌కుడు నాలుగేళ్లపాటు ఈ కథ మీద వర్క్ చేసారు. చెర్రీ లుక్, మేకోవర్ చాలా కొత్తగా ఉండబోతున్నాయి. ఆస్కార్ విన్న‌ర్ ఎఆర్‌ రెహ‌మాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా, ఏగ‌న్ ఏకాంబ‌రం కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు 'RC 16' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ నుంచి సంక్రాంతికి వచ్చిన 'గేమ్ ఛేంజర్' సినిమా నిరాశ పరచడంతో, బుచ్చిబాబు మూవీపైనే మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇది కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తుందని నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News