పవన్ కల్యాణ్ వారసుడు టాలీవుడ్ ఎంట్రీ?
ఇంతకుముందు పలు ఇంటర్వ్యూల్లో రేణు దేశాయ్ అకీరా నందన్ సినీ ఎంట్రీ పై వచ్చిన రూమర్స్ ని ఖండించారు.;

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక ఆయన వారసుడు అకీరా సినిమాల్లో లెగసీని ముందుకు నడిపిస్తాడా? అనే చర్చ వేడెక్కిస్తోంది. పెద్ద కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు చాలా ఆరాటపడుతున్నా అది సాధ్యపడటం లేదు. అడపాదడపా పుకార్లు మినహా అకీరా సినీఎంట్రీపై స్పష్ఠమైన ప్రకటన లేదు. అటు పవన్ కానీ, ఇటు రేణు దేశాయ్ కానీ వారసుడి ఎంట్రీ గురించి మాటెత్తలేదు.
ఇంతకుముందు పలు ఇంటర్వ్యూల్లో రేణు దేశాయ్ అకీరా నందన్ సినీ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ ని ఖండించారు. అకీరా నటుడిగా రంగ ప్రవేశం చేస్తే తానే ముందుగా అభిమానులకు వెల్లడిస్తానని మాటిచ్చారు. అయినా ఇప్పటికీ ఈ గాసిప్పులు ఆగడం లేదు. అకీరా నందన్ ఓజీ చిత్రంతో తెరకు పరిచయమవుతున్నాడని మళ్లీ ఇప్పుడు ప్రచారం సాగుతోంది. అయితే యథావిథిగా మరోసారి రేణు దేశాయ్ ఈ వార్తల్ని ఖండించారు. అకీరా సినీఎంట్రీ ఇస్తే స్వయంగా చెబుతానని అన్నారు. అకిరా OG లో నటించడం లేదని , చరణ్ అతడికి కాస్ట్యూమ్స్ పంపడం లేదని రేణు దేశాయ్ ధృవీకరించారు. చరణ్ తనకు దుస్తులు ధరింపజేస్తున్నట్లు కొన్ని వీడియోలను నేను షేర్ చేశాను.. అలాంటి వార్తలను నాకు ఫార్వార్డ్ చేయవద్దని అకీరా చెప్పాడు``అని రేణు వెల్లడించారు.
అయితే అకీరా ఓజీలో తన తండ్రి పవన్ తో కలిసి కనిపిస్తే చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కానీ రేణు దేశాయ్ ప్రకటన ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఓజీలో కానీ, మరి ఏ ఇతర సినిమాలో కానీ అకీరా నందన్ నటించడం లేదని రేణు స్పష్ఠతనిచ్చారు.
`ఓజీ`లో అకీరా నటించడం లేదని క్లారిటీ వచ్చినా ఆ తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావులో అతిథి పాత్రతో సర్ ప్రైజ్ చేస్తాడని కూడా గాసిప్స్ షికార్ చేసాయి. రామ్ చరణ్ స్వయంగా అకీరాను లాంచ్ చేస్తాడన్న గుసగుస వినిపించింది. కానీ ఇవేవీ నిజాలు కాలేదు.
రేణు రాజకీయాల్లోకి?
రేణు దేశాయ్ తన రెండో పెళ్లి ఆలోచనల గురించి, రాజకీయాల గురించి కూడా తాజా పాడ్ కాస్ట్ లో ప్రస్థావించారు. తన పిల్లలను చూసుకోవడానికి గతంలో పెళ్లి ప్రతిపాదనలను విరమించానని రేణు తెలిపారు. అంతేకాదు పిల్లల కోసం రాజకీయ పార్టీల నుండి ఆఫర్లను తిరస్కరించానని రేణు చెప్పారు. బద్రి చిత్రంతో కథానాయికగా మారిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ సరసన `జానీ`లో నటించారు. ఆ సమయంలోనే పవన్ తో ప్రేమ చిగురించింది. అనంతరం ప్రేమ వివాహంలో ఈ జంట అకీరా నందన్, ఆద్యలను స్వాగతించారు.