లైలా వివాదంలో బుల్లిరాజు - పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?

అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఒక వివాదంతో అతని పేరు వైరల్ కావడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

Update: 2025-02-12 16:39 GMT

సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ కుమారుడిగా బుల్లిరాజు పాత్రతో నటించిన రేవంత్ భీమాల క్యారెక్టర్ ఏ రేంజ్ లో హైలెట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలనటుడిగా తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అతనికి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సినిమాలోని కామెడీ సీన్స్, డైలాగ్స్ వల్ల అతనికి మరింత క్రేజ్ ఏర్పడింది. చిన్న వయసులోనే తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన రేవంత్ భవిష్యత్‌లో పెద్ద స్టార్ అవుతాడనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఒక వివాదంతో అతని పేరు వైరల్ కావడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

ఇటీవల లైలా సినిమాకు రేవంత్ ప్రమోషన్ చేయడం విశేషం. సినిమాలో విశ్వక్ సేన్ నటిస్తుండగా, రేవంత్ అతనితో కలిసి ఒక ప్రోమో వీడియో చేయడం చర్చనీయాంశంగా మారింది. కేవలం సినిమా ప్రమోషన్ కోసమే రూపొందించిన ఈ వీడియో, విశ్వక్ సరదాగా చేసిన కంటెంట్ మాత్రమే. కానీ అది అద్భుతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన అభిమానులు రేవంత్‌ను మరింతగా గుర్తించడంతో, అతనిపై సానుకూల స్పందన వచ్చింది.

అయితే రేవంత్ పేరు కొన్ని ఫేక్ అకౌంట్లు ఉపయోగించి కొందరు లైలా వివాదంలోకి లాగారు. లైలా సినిమా చుట్టూ జరుగుతున్న రాజకీయ విమర్శల్లో బుల్లిరాజు పేరు కూడా జోడించడంతో, అతనిపై కొన్ని నెగటివ్ కామెంట్స్ రావడం ప్రారంభమైంది. దీనివల్ల తప్పుడు ప్రచారం మరింత పెరిగిపోయింది. సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లు, రేవంత్ పేరుతో రాజకీయ విషయాలను పోస్ట్ చేయడం గమనార్హం. తన కొడుకు పేరు తప్పుడు ప్రచారానికి వాడడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగించింది. దీంతో రేవంత్ కుటుంబం ఈ వ్యవహారంపై స్పందించింది.

ఈ వివాదంపై రేవంత్ తండ్రి శ్రీనివాసరావు ఒక లేఖ విడుదల చేశారు. "ఇటీవల మా కొడుకు రేవంత్ పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. మా అబ్బాయికి సంబంధించిన అధికారిక సమాచారం, అప్‌డేట్స్ కేవలం అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా మాత్రమే వెల్లడిస్తాం. ఈ విషయమై తప్పుడు వార్తలు వ్యాపించకుండా అందరూ సహకరించాలి" అంటూ స్పష్టం చేశారు. రేవంత్‌ను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని, అతని పేరును ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ వ్యవహారం మరింత తీవ్రమవుతుందనే ఆందోళనతో రేవంత్ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని కావాలని వ్యతిరేక ప్రస్తావనలు చేయడం, అతని పేరును ఉపయోగించి అనవసరమైన వివాదాలు సృష్టించడం క్షమించరాని విషయం అని అన్నారు. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో రేవంత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి బాలనటుడిని అనవసరమైన రాజకీయ వివాదాల్లోకి లాగడం అతని భవిష్యత్‌పై ప్రభావం చూపించొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News